కర్నూలులో త్రిముఖ పోటీ

Apr 14,2024 23:02 #A three-way contest, #Kurnool

జిల్లాలో మారనున్న పార్టీల బలాబలాలు
– వైసిపి, టిడిపి, కాంగ్రెస్‌ అభ్యర్థుల ఖరారు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి:గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు పోల్చినప్పుడు కర్నూలు జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. కర్నూలు జిల్లా పునర్విజన అనంతరం ఒక పార్లమెంటు, 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో కర్నూలు ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు, 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండేవి. అన్నింటినీ అధికార వైసిపి కైవసం చేసుకుంది. కర్నూలు పార్లమెంటు పరిధిలో ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. టిడిపి, జనసేన, బిజెపి కూటమి, వైసిపి అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించాయి. కర్నూలు పార్లమెంటు స్థానానికి, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కర్నూలు పార్లమెంటు బరిలో టిడిపి తరపున బస్తిపాటి నాగరాజు, వైసిపి తరపున బివై రామయ్య పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున రాంపుల్లయ్య యాదవ్‌ పేరును ప్రకటించారు.
ఆదోనిలో వైసిపి తరపున ప్రస్తుత ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌ రెడ్డి బరిలో ఉండగా, టిడిపి కూటమి తరపున బిజెపి అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి పోటీలో ఉన్నారు. డాక్టర్‌ పార్థసారథి గతంలో బిజెపి కర్నూలు ఎంపి అభ్యర్థిగా పోటీ చేశారు. కొంత పరిచయాలు పెరిగాయి. కాని సాయిప్రసాద్‌రెడ్డి మూడుసార్లు ఆదోని ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి తనబలాన్ని నిరూపించుకుంటాననే ధీమాతో ఉన్నారు. ఆలూరులో టిడిపి తరపున వీరభద్రగౌడ్‌, వైసిపి తరపున బుసినే విరూపాక్షి పోటీపడనున్నారు. వీరభద్రగౌడ్‌ గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. విరూపాక్షి ప్రస్తుతం అలూరు నియోజవర్గ పరిధిలోని చిప్పగిరి జెడ్‌పిటిసిగా, రైల్వే కాంట్రాక్టరుగా ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.
మూడు పార్టీల మధ్య పోటీ
మంత్రి గుమ్మనూరు జయరామ్‌ ఇక్కడ సిట్టింగు ఎమ్మెల్యేగా ఉండి వైసిపి మెప్పుపొందలేకపోయారు. పైగా అవినీతి ఆరోపణలున్నాయని పక్కనబెట్టారు. ఎంపికి పోటీచేసేందుకు అవకాశం కల్పించినా నిరాకరించి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. పత్తికొండలో టిడిపి తరపున కెఇ శ్యామ్‌బాబు, వైసిపి తరపున కంగాటి శ్రీదేవి బరిలో ఉన్నారు. ఇండియా వేదిక తరపున సిపిఐ అభ్యర్థిగా రాయచంద్రయ్య పోటీలో ఉంటారు. ఇక్కడ మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. కెఇ శ్యామ్‌బాబు మాజీ డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి కుమారుడు. పోటీ ఉంటుంది. అధికార వైసిపికి పరిస్థితి అనుకూలించవచ్చని అనుకుంటున్నారు.
మంత్రాలయంలో టిడిపి తరపున రాఘవేంద్రరెడ్డి, వైసిపి తరపున వై బాలనాగిరెడ్డి బరిలో ఉన్నారు. టిడిపిలో ముందు నుంచీ పాలకుర్తి తిక్కారెడ్డి టికెట్‌ ఆశించారు. టికెట్‌ రానందుకు అసంతృప్తితో ఉన్నారు. ఎలాగైనా తనకే టికెట్‌ మారుస్తారని ఆశతో ఉన్నారు. టికెట్‌ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా పోటీ చేయాలని యోచిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే వైసిపి అభ్యర్థి వై బాలనాగిరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నాలుగోసారి కూడా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.
సిపిఎం అభ్యర్థిగా డి గౌస్‌ దేశారు
కర్నూలులో టిడిపి తరపున టిజి భరత్‌, వైసిపి తరపున రిటైర్డు ఐఎఎస్‌ అధికారి ఇంతియాజ్‌ అహ్మద్‌ బరిలో ఉన్నారు. ఇండియా వేదిక అభ్యర్థిగా సిపిఎం తరపున డి గౌస్‌ దేశారు పోటీ చేస్తున్నారు. టిజి భరత్‌ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ ముస్లిం మైనార్టీలు 40 శాతం ఓట్లున్నాయని, అందుకే ముస్లిం అభ్యర్థిని వైసిపి ప్రకటించింది. అయితే సిట్టింగు ఎమ్మెల్యే ఎంఎ హఫీజ్‌ ఖాన్‌ ముస్లిం అయినప్పటికీ ఇంతియాజ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసిపిలో చేరడంతో అధిస్టానం ఆయనకు టికెట్‌ కేటాయించింది. తీరా హఫీజ్‌ఖాన్‌ అసంతృప్తితో పున్నారని వైసిపి అధికారంలోకి వస్తే రాజ్యసభ ఇస్తామని వైఎస్‌ జగన్‌ ప్రకటించి సంతృప్తి పరిచారు. వైసిపిలో ఎస్‌వి మోహన్‌తోపాటు అందరూ కలిసి ఇంతియాజ్‌ గెలుపునకు కృషి చేస్తారని అనుకుంటున్నారు. సిపిఎం గతంలో రెండు సార్లు కర్నూలు నుంచి గెలుపొందింది. బలమైన కేడర్‌ ఉంది. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లు కూడా ఉన్నాయి. దీంతో సిపిఎంకు ఇంకొంత బలం పెరగనుంది.
కోడుమూరు (ఎస్‌సి) నియోజకవర్గంలో టిడిపి తరపున బగ్గుల దస్తగిరి, వైసిపి తరపున డాక్టర్‌ ఆదిమూలపు సతీష్‌, కాంగ్రెస్‌ తరపున మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీ కృష్ణ పేర్లను ప్రకటించారు. కాంగ్రెస్‌ ప్రభావం వల్ల గట్టి పోటీ ఉంటుంది. ఆదిమూలపు సతీష్‌ తొలిసారి ఎన్నికల బరిలోకి వచ్చారు. టిడిపి అభ్యర్థి కూడా తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఆయనకు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అనుచరులు సహకరించడం లేదు. టిడిపిలో గ్రూపు తగాదాలున్నాయి.
ఎమ్మిగనూరులో టిడిపి తరపున బివి జయనాగేశ్వర్‌ రెడ్డి, వైసిపి తరపున బుట్టా రేణుక పోటీకి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి బివి మోహన్‌రెడ్డి కుమారుడు డాక్టర్‌ జయనాగేశ్వర్‌రెడ్డి. బుట్టారేణుక వైసిపి తరపున కర్నూలు ఎంపిగా 2014లో గెలుపొందారు. తరువాత ఆమె టిడిపిలో చేరారు. ఆ తర్వాత తిరిగి వైసిపిలోకి వచ్చారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికవర్గం ఎక్కువగా ఉన్నందున ఆమెకు వైసిపి టికెట్‌ కేటాయించింది.

➡️