‘ ఆత్మ గౌరవ దీక్ష ‘ – మోడీ ప్రభుత్వ తీరుకు నిరసన : వి.శ్రీనివాసరావు

విజయవాడ : నేడు మహాత్మా గాంధీ వర్థంతిని పురస్కరించుకొని… రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా, మంగళవారం ఉదయం విజయవాడ లెనిన్‌ సెంటర్‌ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ‘ ఆత్మ గౌరవ దీక్ష ‘ ను నిర్వహించారు. ముందుగా వామపక్ష నాయకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … మతోన్మాదులు మహాత్మాగాంధీని హత్య చేసిన రోజు ఇది అని అన్నారు. దేశాన్ని బలహీనపరిచి విధ్వంసం చేయాలనుకున్న ఆ మతోన్మాద శక్తులే నేడు ప్రభుత్వంలో ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆ శక్తులే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిని కూడా కుంటుపరుస్తున్నాయన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే కనీసం స్పందించకుండా, ‘ మేం ప్రత్యేక హోదా ఇవ్వం – ఏం చేసుకుంటారో చేసుకోండి ‘ అంటూ… రాష్ట్ర ప్రయోజనాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు నిరసన దీక్షను గాంధీ మహాత్ముడి సాక్షిగా ప్రారంభించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. ఢిల్లీకి కూడా వెళ్లి పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలో అక్కడ నిరసనలు తెలపాలని ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునిచ్చిందన్నారు.2019 ముందు కోతలు కోసిన అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీలు టిడిపి, జనసేనలు… మోడీకి కొమ్ముకాస్తున్నాయన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినందుకు గల్లా జయదేవ్‌ పై ఈడీని ప్రయోగించారని. ప్రత్యేక హోదా అడిగినవారిపై కక్ష సాధింపుచర్యలు చేపట్టడం క్షమించరాని నేరం అని అన్నారు. సొంత పార్టీ ఎంపి ఈ ఆరోపణలు చేస్తుంటే టిడిపి ఏమాత్రం నోరెత్తకుండా మౌనంగా ఉందని ఇది వారి అసమర్థతకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. కాబట్టి ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నేడు ప్రారంభించిన ఈ ఆత్మ గౌరవ దీక్షను రాష్ట్రవ్యాప్తంగా అందరూ కలిసి జయప్రదం చేయాలని వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

https://www.facebook.com/watch/?v=1401118747455513

➡️