రోడ్డుప్రమాదంలో ఎబిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జడ్సన్‌ మృతి

ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) : అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాట సంఘం (ఎబిపిఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు గద్దె జడ్సన్‌ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ప్లై ఓవర్‌పై ఈ ఘటన జరిగింది. పోలీస.ులు తెలిపిన వివరాల మేరకు… ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం, ఇనమనమెళ్లూరుకు చెందిన జడ్సన్‌ ఒంగోలుకు వెళుతుండగా సూరారెడ్డిపాలెం ప్లై ఓవర్‌పై గుర్తు తెలియని వాహనం ఆయన బైక్‌ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో జడ్సన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. టంగుటూరు ఎస్‌ఐ పున్నారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం కోసం యూనియన్‌ ఏర్పాటు చేసేందుకు జడ్సన్‌ కీలకపాత్ర పోషించారు. ఒంగోలులో ప్రారంభమైన అగ్రిగోల్డ్‌ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం కోసం అనేక పోరాటాలు నిర్వహించారు. జడ్సన్‌ కెవిపిఎస్‌ మద్దిపాడు మండల మాజీ కార్యదర్శిగా పనిచేశారు. ఇనమనమెల్లూరులో అన్యాక్రాంతమైన భూములను పేదలకు ఇప్పించడంలో కీలకపాత్ర పోషించాడు.

సిపిఎం నివాళి
గద్దె జడ్సన్‌ భౌతికకాయానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య పార్టీ జెండా కప్పి.. నివాళులర్పించారు. కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సంతాపం తెలిపారు.

➡️