విశాఖలో 40 వేల ఎకరాల భూ దందా

Dec 18,2023 08:12 #Atchannaidu, #land scams, #Visakha
Acchennaidu on ycp

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ : మూడు రాజధానుల పేరుతో విశాఖలో వైసిపి నాయకులు కొండలను సైతం వదలకుండా 40 వేల ఎకరాల భూములను కొల్లగొట్టారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మెహన్‌ రెడ్డికే దక్కుతుందన్నారు. నాలుగున్నరేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మిగిల్చారని ధ్వజమెత్తారు. విశాఖలోనే రాజధాని అంటూ ఉత్తరాంధ్ర ప్రజలను వంచిస్తున్నారని, ఉత్తరాంధ్ర మంత్రులు సైతం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. జగన్‌ ధన దాహాన్ని తట్టుకోలేక పారిశ్రామికవేత్తలు సైతం పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని దుయ్యబట్టారు. ఆయన అవినీతిలో మంత్రులు పాత్రధారులుగా ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కిందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి, వలసల నివారణకు ప్రత్యేక నిధులు వమంజూరు చేస్తామని, సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేపట్టారని చెప్పారు. వంశధార ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం వల్లే 84 శాతం పనులు పూర్తి అయ్యాయని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్కశాతం కూడా పనులు ముందుకు సాగలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, ఆయన వల్లే ఈ ప్రాంత అభివృద్ధి సాధ్యమన్నారు.

➡️