Accident: ‘కృష్ణా’లో ఘోర రోడ్డు ప్రమాదం -ఆరుగురు దుర్మరణం

Jun 14,2024 23:22 #Krishna district, #road accident

-మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, పెడన, బంటుమిల్లి:కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాలు గుజ్జయ్యాయి. పోలీసులు, బాధితుల బంధువుల కథనం ప్రకారం… కాకినాడ జిల్లా కరప మండలం గొర్రిపూడి గ్రామానికి చెందిన మేస్త్రీ మేడిశెట్టి మహేష్‌కుమార్‌ కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెదతుమ్మడి గ్రామ చెరువులో చేపల పట్టుబడికి ఒప్పందం కుదుర్చుకున్నారు. చేపల వేటకు తొమ్మిది మంది కార్మికులను తీసుకుని డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి అశోక్‌ లేలాండ్‌ దోస్తు మినీ వ్యాన్‌లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 4.45 గంటలకు కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి 216పై కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామం వద్ద సరుకుబాదులతో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌ టేక్‌ చేసేందుకు మినీ వ్యాన్‌ ప్రయత్నించింది. ఈ క్రమంలో తొలుత ట్రాక్టర్‌ను ఢకొీని అదుపు తప్పింది. ఆ తర్వాత అదే సమయంలో పాండిచ్చేరి నుంచి భీమవరానికి చేప పిల్లల సీడ్‌తో వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢకొీంది. ఈ ఘటనలో కరప మండలం గొర్రిపూడికి చెందిన మినీ వ్యాన్‌ డ్రైవర్‌ గండి ధర్మావర ప్రసాద్‌ (27), తమిళనాడు రాష్ట్రం సెయ్యగుప్తం గ్రామానికి చెందిన టాటా కంటైనర్‌ డ్రైవర్‌ అయ్యప్పన్‌ జయరామన్‌ (42), డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనిపాడు మండలం గద్దనపల్లి గ్రామానికి చెందిన మాగాపు నాగరాజు (32), చింతా లోవరాజు (27) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఉప్పలగుప్త మండలం ఎస్‌ యానాంకు చెందిన రేవు నాగభూషణం (25) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. తీవ్రంగా గాయపడిన మేస్త్రీ మేడిశెట్టి మహేష్‌కుమార్‌, కార్మికులు రేవు గణేశ్వరరావు, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గద్దన్నపల్లికి చెందిన చింతా దుర్గాప్రసాద్‌, ఎస్‌ యానాంకు చెందిన మల్లాది శ్రీకాంత్‌, సంగాని నాగేంద్రబాబు… మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలాన్ని కృష్ణా జిల్లా ఎస్‌పి నయీం అద్నాన్‌ పరిశీలించారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోడ్డు ప్రమాద బాధితులను రాష్ట్ర ఎక్సైజ్‌, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్‌ డికె.బాలాజీ, ఎస్‌పి నయీం అద్నాన్‌ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం తరఫున చెల్లిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. ఈ ప్రమాదంపై ఎంపి వల్లభనేని బాలశౌరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

ప్రమాదంలో గాయపడి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు.

➡️