ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నేరం అంగీకరించిన నిందితులు

  • ప్రభాకర్‌రావు, కిషన్‌రావులకు లుకౌట్‌ నోటీసులు

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందంటూ ఆ సమయంలో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబి)లో పనిచేసిన ఉన్నతాధికారులు అంగీకరించారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకరరావు ఆదేశాల మేరకే ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు, ఐ న్యూస్‌ మీడియా నిర్వాహకుడు శ్రవణ్‌రావు పాత్ర కూడా ఉందని పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికే ప్రభాకరరావు, రాధాకిషన్‌రావు దేశం విడిచి వెళ్లినట్లు తెలియడంతో వారికి లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నేతల ఫోన్లను తరచుగా హ్యాక్‌ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు పోలీసులు దానిపై దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎస్‌ఐబి వ్యవహారాలపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడైన గత డిసెంబర్‌ మూడున ఎస్‌ఐబి డిఎస్‌పిగా ఉన్న ప్రణీత్‌రావు ఎస్‌ఐబి కార్యాలయంలో ఫోన్‌ హ్యాకింగ్‌కు సంబంధించిన డేటాను ధ్వంసం చేసి హార్డ్‌ డిస్క్‌లను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో, ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణీత్‌ రావును అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి విచారించారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలం మేరకు… ప్రణీత్‌రావుతో కలిసి ఎస్‌ఐబిలో పనిచేసిన అదనపు ఎస్‌పిలు భుజంగరావు, తిరుపతన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను కలిపి విచారించేందుకు పోలీసులు మంగళవారం కోర్టులో కస్టడీ పిటిషన్‌ వేయనున్నారు. అయితే, చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని అంగీకరించారని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. ప్రణీత్‌రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. వారిచ్చిన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్‌ డిస్క్‌ల భాగాలను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు.

➡️