అంగన్వాడీ జీతాల పెంపుపై బొత్స వ్యాఖ్యలు దుర్మార్గం

achanta sunitha on ycp ministers
  • అంగన్వాడీలపై కక్ష కట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం 
  • ఆచంట సునీత

ప్రజాశక్తి-మంగళగిరి : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సహా వైసీపీ నేతలకు అధికారమదంతో కళ్లు నెత్తికెక్కాయని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత విమర్శించారు.  న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 19 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడటం దుర్మార్గమన్నారు.  తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ ఏపీలో పెంచలేమని మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడటం రాజకీయ దిగజారుడుతనాన్ని తెలియజేస్తోందన్నారు. జీతాలు పెంచడం చేతకానప్పుడు తెలంగాణ కంటే వెయ్యి రూపాయిలు ఎక్కువే ఇస్తానని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో కేవలం వెయ్యి పెంచి అంగన్వాడీల జీవితాలను ఉద్దరించినట్టు మాట్లాడితే ఎలా? వేతనాల పెంపుకు ఇది సరైన సమయం కాదని మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఏమైనా సొంత బీరువాలో డబ్బులు తీసి అంగన్వాడీలకు ఇస్తున్నారా? దొరికిన చోటల్లా తెస్తున్న లక్షల కోట్లు అప్పులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు.  ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడానికి, బినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి చేతులు వస్తాయి కానీ అంగన్వాడీలకు జీతం పెంచలేరా అని నిలదీశారు.  2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ. 4,200 ఉన్న జీతాన్ని రెండు విడతల్లో రూ. 10,500 పెంచితే జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అక్రమ అరెస్ట్ లు చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలకు 100 రోజుల్లో చరమగీతం పాడుతామని, టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

➡️