భూ యాజమాన్య హక్కు చట్ట సవరణపై పిల్‌

Dec 29,2023 08:45 #AILU, #Land Titling Act
ailu pil on land titling act andhra pradesh

ప్రజాశక్తి-అమరావతి : ఎపి భూ యాజమాన్య హక్కు చట్టంలో సవరణ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలూ) ఎపి అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎపి భూ యాజమాన్య హక్కు చట్టం (ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022)కు చట్టబద్ధత లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, జిఎడి ముఖ్య కార్యదర్శి, లా సెక్రటరీలను ప్రతివాదులుగా చేశారు.’ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం (ఎపి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022)లోని కొన్ని నిబంధనలను రద్దు చేయాలి. భూ యాజమాన్య హక్కు చట్టం భారతీయ వారసత్వ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది. 21, 246, 300ఏ అధికరణాలకు విరుద్ధం. రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను కాలరాసేలా భూ యాజమాన్య చట్టంలోని 10, 13, 14, 15, 25, 34, 46 సెక్షన్లు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా ఆస్తి హక్కును హరించేదిగా ఉన్నాయి. సెక్షన్‌ 10 ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (టిఆర్‌ఒ)కి అధికారాలు కల్పించడం అన్యాయం. ఆస్తి వివరాల్ని వివాదాల రిజిస్ట్రర్లో నమోదు చేస్తే దానిని అమ్మేందుకు వీలుండదు. ప్రభుత్వ నిర్ణయం కోర్టుల అధికారాలను లాక్కునేలా ఉన్నాయి. కోర్టుల అధికారాలను రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టడమే అవుతుంది. సెక్షన్‌ 13 ప్రకారం.. రికార్డ్‌ ఆఫ్‌ టైటిల్స్‌ ఓసారి యజమాని పేరు నమోదు చేశాక.. 2 ఏళ్లలోపు ఎవరూ అభ్యంతరం చెప్పకపోతే ఆ యజమానే హక్కుదారుడుగా మారిపోవడం దారుణమైన విషయం. భూ యాజమాన్య చట్టంలోని సెక్షన్‌ 25 ప్రకారం మృతుల వారసులకు వారసత్వ ధ్రువపత్రాన్ని మంజూరు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు కల్పించడం భారతీయ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 371కి విరుద్ధం. ఆ 371 ప్రకారం జిల్లా జడ్జి మాత్రమే వారసత్వ ధ్రువపత్రం ఇవ్వాలి. సెక్షన్‌ 38 ప్రకారం టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌, ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పీలేట్‌ ఆఫీసర్లకు కల్పించిన భూ వివాదాల పరిష్కారం, రికార్డుల్లో వివరాల నమోదు తదితర వ్యవహారాలను సివిల్‌ కోర్టుల్లో విచారణలు చేయకుండా నిషేధం విధింపు చట్ట వ్యతిరేకం. దీనివల్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులు.. ఆస్తి వివాదాల దావాలను వెనక్కి పంపేస్తున్నారు. ప్రభుత్వం చేసిన భూ యాజమాన్య హక్కు చట్టంలో సవరణలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించాలి’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

➡️