విశాఖ ఉక్కు ఆస్తులు అమ్ముకునేందుకు అనుమతించండి

Jun 25,2024 23:39 #visakha steel

– హైకోర్టును కోరిన విశాఖ ఉక్కు యాజమాన్యం
ప్రజాశక్తి-అమరావతి :విశాఖ ఉక్కు పరిశ్రమ భూములు, ఆస్తుల అమ్మకాల విషయంలో స్టేటస్‌కో కొనసాగించాలన్న గత ఉత్తర్వులను సవరించాలని ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. విశాఖ ఉక్కు ఆస్తుల విక్రయం విషయంలో యథాతథస్థితి (స్టేటస్‌ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీనిని సవరించాలని విశాఖ ఉక్కు యాజమాన్యం (ఆర్‌ఎఐఎన్‌ఎల్‌) మంగళవారం హైకోర్టును కోరింది. ఆర్‌ఎన్‌ఎల్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లందరినీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ జగడం సుమతితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఐపిఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్‌, సువర్ణరాజు విడివిడిగా పిల్స్‌ వేశారు. వీటి విచారణ వచ్చే నెల రెండుకు వాయిదా పడింది

➡️