పాత ప్లాన్‌ ప్రకారమే అమరావతి

Jun 16,2024 22:45 #amaravati, #old plan

– రాజధాని అభివృద్ధి పనులు రెండున్నరేళ్లలో పూర్తి
– మూడు వారాల్లో అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ
– మున్సిపల్‌శాఖ మంత్రి పి నారాయణ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం గతంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే చేపట్టనున్నట్లు మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అభివృద్ధికి తొలిదశలో రూ.48 వేల కోట్లతో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి దాదాపు రూ.9 కోట్లు చెల్లింపులు కూడా గతంలో చేశామన్నారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో మంత్రిగా ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అభివృద్ధి పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉత్తమమైన డిజైన్‌ను రూపొందించామన్నారు. రాజధానిలో చేపట్టే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమమైనా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా సింగపూర్‌ ప్రభుత్వ సహాయంతో అత్యుత్తమమైన డిజైన్‌ను రూపొందించి అమలు పరిచామన్నారు. రాజధానిలో మెజార్టీ ప్రాంతం కవరయ్యేలా మౌలిక వసతుల కల్పనతోపాటు మంత్రులు, కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణానికి తొలిదశలో పనులు చేపట్టేందుకు గతంలో రూ.48 వేలకోట్లు అవుతాయని అంచనా వేశామన్నారు. మంత్రుల కార్యదర్శులు, అధికారులు, ఉద్యోగుల నివాసాలకు సంబంధించి భవనాల నిర్మాణం కూడా 90 శాతం పూర్తయినట్లు ఆయన తెలిపారు. తొలిదశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తవుతాయని, రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బాధ్యతలు స్వీకరించిన మంత్రి నారాయణను అమరావతి రైతులు కలిసి అభినందనలు తెలిపారు.
మూడు వారాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
నిరుపేదలు కేవలం రూ.5 చొప్పున ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందించే అన్న క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం క్యాంటీన్ల పునరుద్ధరణపై మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిఎంగా చంద్రబాబు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైల్‌ కూడా ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ 184 ప్రారంభించగా, మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోయాయన్నారు. అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు అంచనాలను రెండు, మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించారు. గతేడాది అన్న క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్‌ సంస్థకు అప్పగించామని, మూడు పూటలా ఆహారం అందజేసేందుకు రోజుకు రూ.73 ఛార్జి చేయడం జరిగిందన్నారు. రోజుకు కేవలం రూ.15లకే మూడు పూటలా ఆహారం అందజేస్తూ మిగిలిన రూ.58లను రాయితీగా ప్రభుత్వమే భరించిందన్నారు. రోజుకు 2.25 లక్షల మంది అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని, తమ హయాంలో మొత్తమ్మీద నాలుగు కోట్ల అరవై లక్షల 31 వేల 600 ప్లేట్ల భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సిఎస్‌ వై శ్రీలక్ష్మి, సిడిఎంఎ శ్రీధర్‌, సిఆర్‌డిఎ కమిషనరు వివేక్‌ యాదవ్‌, అదనపు కమిషనరు కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్‌ కమిషనరు స్వప్నిల్‌ దినకర్‌, సిఆర్‌డిఎ చీఫ్‌ ఇంజినీర్‌ ఎన్‌విఆర్‌కె ప్రసాద్‌, సిహెచ్‌ ధనుంజరు పాల్గొన్నారు.

➡️