సర్వం సిద్ధం

Jan 19,2024 08:19 #BR Ambedkar, #final touches, #statue

-రేపు 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం, స్మృతివనాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- విజయవాడ :విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్‌ విగ్రహం, స్మృతి వనం పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.400 కోట్లు ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 18 ఎకరాల విస్తీర్ణంలో సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా 81 అడుగుల వేదికపై 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంటే, విగ్రహం ఎత్తు 206 అడుగులు అవుతుంది. విగ్రహ ప్రతిష్ట ప్రాంగణంలో ఆడిటోరియం, అంబేద్కర్‌ జీవిత కాలంలో వినియోగించిన వస్తువులతో మ్యూజియం, లేజర్‌ షో వంటి అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు నిర్వహించారు. విగ్రహం కింది భాగంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు ఫస్ట్‌ ఫోర్‌ను 2,250 చదరపు అడుగుల విస్తీర్ణంలో, సెకండ్‌ ఫ్లోర్‌ను 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. వీటిలో నాలుగు ఎసి హాళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో హాలు విస్తీర్ణం నాలుగు వేల చదరపు అడుగులు. ఓ హాలులో అంబేద్కర్‌ జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించేలా మిని థియేటర్‌ను నిర్మించారు. మిగిలిన హాళ్లలో అంబేద్కర్‌ బాల్యం, విద్య, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలోని ఘట్టాలకు సంబంధించిన ఛాయ చిత్రాలను, వస్తువులను ప్రదర్శించేందుకు మ్యూజియంను ఏర్పాటు చేశారు. ఒక హాలులో అంబేద్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే ఉంటుంది. విగ్రహం బేస్‌ కింది భాగంలో, ఫస్ట్‌, సెకండ్‌ ఫ్లోర్‌లు ఉన్నాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లలో అంబేద్కర్‌ చరిత్ర తెలిపే డిజిటల్‌ మ్యూజియం ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని షూ దగ్గర నుంచి బెల్ట్‌ వరకు హనుమాన్‌ జంక్షన్‌ వద్ద శిల్పి ప్రసాద్‌ ఆధ్వర్యంలో కాస్టింగ్‌ చేశారు. మిగిలిన భాగాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన వారు రూపొందించారు. స్మృతివనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరులోని బటానికల్‌ గార్డెన్‌తోపాటు హైదరాబాద్‌ తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి బృందావనాల రూపురేఖలను పరిశీలించి వాటి ఆధారంగా అత్యుత్తమ ల్యాండ్‌ స్కేపింగ్‌ ప్రణాళికతో అంబేద్కర్‌ స్మృతివనాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. కడియం నర్సరీ నుండి మొక్కలను తీసుకొచ్చి ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ దాదాపుగా 500 మందిపైగా కార్మికులు వీటి పనులు పూర్తి చేసేందుకు శ్రమించారు. రాష్ట్రం నుండే కాకుండా దేశ వ్యాప్తంగా సందర్శకులు సందర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజూ దాదాపు వేలాదిమంది పర్యాటకులతో అతి పెద్ద పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకొని చరిత్ర పుటల్లో నిలిచేలా దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. శుక్రవారం నాలుగు గంటలకు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బహిరంగ సభ జరగనుంది. అనంతరం అంబేద్కర్‌ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరంలోని వివిధ కూడళ్లలో ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

➡️