విశాఖలో యువతి కిడ్నాప్‌కు ఆటో డ్రైవర్‌ యత్నం

Feb 27,2024 11:46 #auto drivers, #visaka, #Women
  • రన్నింగ్‌ ఆటోలో నుండి దూకేసిన యువతి

 ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖ నగరంలో యువతిని కిడ్నాప్‌ చేసేందుకు ఓ ఆటోడ్రైవర్‌ యత్నించాడు. ఆటోలో నుంచి దూకడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటన రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నగరంలోని ద్వారకానగర్‌ ఏరియాలో ఓ బంగారం షాప్‌లో అరిలోవ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ళ యువతి పనిచేస్తుంది. రోజులానే విధులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అయితే డ్రైవర్‌ ఆటోను అరిలోవ వైపు కాకుండా రైల్వే స్టేషన్‌ వైపు తీసుకెళ్లడం యువతి గుర్తించిన గట్టిగా ప్రశ్నించింది. అతను సమాధానం ఇవ్వక పోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన యువతి రన్నింగ్‌ ఆటోలో నుండి కిందకు దూకేసింది. దీంతో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం యువతిని ఆసుపత్రికి తరలించారు. భయంతో ఆటో డ్రైవర్‌ అక్కడి నుండి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

➡️