ఆంధ్రప్రదేశ్‌ శకటం సిద్ధం

Jan 22,2024 21:29 #andrapradesh, #Republic Day 2024

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ‘ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం’ ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్‌ శకటం సిద్ధమైంది. ఈ నెల 26న కర్తవ్య పథ్‌లో వికసిత్‌ భారత్‌ థీమ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శకటాన్ని ప్రదర్శించనున్నారు.

‘విద్య అనేది పిల్లలకు ఇవ్వగల ఆస్తి, విద్యా రంగంలో వెచ్చించే ఖర్చు అంతా రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి పెట్టుబడి అవుతుంది’ అని రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు, వినూత్న పథకాలను తీసుకురావడంతో పాటు కార్పొరేట్‌ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలను అప్‌గ్రేడ్‌ చేయడంతో మన విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రానికి వివరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమంతో ఇంగ్లీష్‌ ల్యాబ్‌, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, స్మార్ట్‌ టివి, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, ప్లే గ్రౌండ్‌ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు అందరినీ ఆకట్టుకునేలా శకటంలో ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. ఎపి శకటానికి సమాచార పౌర సంబంధాలశాఖ రూపకల్పన చేసింది. తదనుగుణంగా 55 సెకండ్ల నిడివిగల థీమ్‌ సాంగ్‌ను రూపొందించి ప్రదర్శనకు సిద్ధమైనట్లు సమాచార పౌర సంబంధాలశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

➡️