అబద్ధపు ప్రచారం వద్దు : ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అంగన్‌వాడీ సంఘాల లేఖ

Dec 14,2023 08:47 #Anganwadi Workers, #strike
anganwadi workers letter to cs on false news

ప్రభుత్వ ప్రకటనలో అవాస్తవాలను సరిదిద్దాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీలపై ప్రభుత్వం చేసిన ప్రకటనలో అన్నీ అవాస్తవాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాలని సమ్మెలో ఉన్న అంగన్‌వాడీ సంఘాలు ఉమ్మడిగా కోరాయి. ఈ మేరకు ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబిరాణి, కె సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ (ఎఐటియుసి) ప్రధాన కార్యదర్శి జె లలితమ్మ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ప్రధాన కార్యదర్శి విఆర్‌ జ్యోతి ఉమ్మడిగా బుధవారం స్త్రీ, శిశుసంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వినతిపత్రాన్ని మెయిల్‌ ద్వారా పంపి, దీన్ని మీడియాకు విడుదల చేశారు. 11, 12 తేదీల్లో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో జరిగిన అంశాలకు భిన్నంగా అవాస్తవాలతో కూడిన ప్రకటన విడుదల చేశారని, వాటిని సరిదిద్దాలని కోరారు. వైసిపి ప్రభుత్వం రాకముందు అంగన్‌వాడీలకు రూ.10,500 వేతనం ఉందని, అనంతరం 2019 జూన్‌ 26న వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని తెలిపారు. రూ.4,500 పెంచారని పూర్తి అబద్ధపు ప్రకటన చేశారని పేర్కొన్నారు. మినీ వర్కర్లకు రూ.6 వేలు వేతనం ఉందని, వారికీ రెండున్నర వేలు పెంచారని ప్రకటించారని, ఈ తప్పులను సరిదిద్దాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వైఎస్‌ఆర్‌ ఆసరా, రైతుభరోసా, వసతిదీవెన, ఆరోగ్యశ్రీ పథకాలను అంగన్‌వాడీ కార్యకర్తలకు అమలు చేస్తున్నట్లు ప్రకటించడం పూర్తి అవాస్తమని తెలిపారు. దీనిపై అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటికైనా నవరత్నాలు పథకాన్ని అమలు చేయాలని కోరారు. సమ్మె విరమించకపోతే లక్షా ఆరువేల మంది అంగన్‌వాడీలను డిస్మిస్‌ చేస్తారని కఠువుగా మాట్లాడారని, దీన్ని ప్రభుత్వ బెదిరింపుగానే పరిగణించాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఇలాంటి హెచ్చరికలు చేయడం సరికాదని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పోషకాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రచారం చేస్తున్నారని, 7వ తేదీలోగా ప్రతినెలా ఇస్తున్నామని, ఈ నెల కావాలనే ప్రభుత్వం సరఫరా చేయడం లేదా అని ప్రశ్నించారు. అయినా తాము డిసెంబరు 8 నుండి జరగాల్సిన సమ్మెను 12వ తేదీకి వాయిదా వేసుకున్నామని గుర్తించాలని తెలిపారు. స్మార్ట్‌ ఫోన్లు యాప్‌లు అమలు చేయడానికి ప్రభుత్వం ఇచ్చిందని, ఈ యాప్‌ల వల్ల విపరీతంగా పనిభారం పెరిగిందని, అవి చాలాచోట్ల పనిచేయడం లేదని, ఇబ్బందులూ పెరిగాయని అన్నారు. వాటివల్ల ఎవరికీ ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనమూ లేదని వివరించారు. అలాగే అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.రెండు లక్షలు ప్రమాద బీమా ఇస్తున్నట్లు లేఖలో రాశారని, అది వాస్తవం కాదని పేర్కొన్నారు. డిసెంబరు 11న జరిగిన చర్చల్లో ఇప్పటి నుండి అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారని, గతంలో ఇచ్చినట్లు ప్రకటించడం సరికాదని అన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో తాము ఒక్కరోజు కూడా సమ్మె చేయలేదని, సామరస్యంగా పరిష్కరించాలని పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నామని వివరించారు. అనేకసార్లు నిరసనలు కూడా తెలిపామని, అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సమస్యలు పరిష్కరించలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలకు న్యాయం చేయాలని, సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని కోరారు. దీన్ని జఠిలం చేయొద్దని, ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత త్వరగా విధులకు హాజరవుతామని తెలిపారు. లబ్ధిదారులకు అసౌకర్యం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించొద్దని వారు కోరారు.

➡️