మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం : కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, కుప్పం : ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు. కుప్పం సిడిపిఒ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను శనివారం కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మీకు అండగా ఉంటాం.. న్యాయమైన కోర్కెల కోసం పోరాడతాం.. జగన్‌ ప్రభుత్వం అత్యంత దుర్మారంగా వ్యవహరిస్తోంది. ఆవేదనకు గురై కొందరు మృతిచెందారు. అధైర్యపడకండి.. మీ పోరాటం విజయవంతమ వుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది’ అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు, వేధింపులకు గురిచేస్తోన్న అధికారులపై చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు లలిత, కస్తూరి, సరళ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

➡️