డయేరియాతో మరొకరు మృతి

Feb 19,2024 10:24 #Another, #Diarrhea cases, #died

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో డయేరియాతో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో, డయేరియా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. గుంటూరులోని శ్రీనగర్‌కు చెందిన గాజుల సూర్యనారాయణ (75) నాలుగు రోజుల క్రితం విరోచనాలతో స్థానిక ప్రయివేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మరణించారు. కిడ్నీ సమస్య కూడా ఉండడం వల్ల సూర్యనారాయణ మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. విరోచనాలు ఎక్కువగా రావడం వల్లే ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. డయేరియా తీవ్రత వల్ల కిడ్నీ కూడా ఫెయిల్‌ అయి ఉండవచ్చని చెబుతున్నారు. డయేరియాతో గతంలో మృతి చెందిన వారిలో ఓబులేసు, పద్మ, ఇక్బాల్‌ ఉన్నారు. కాగా, గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లోని డయేరియా వార్డులో ఇప్పటికే 62 మంది చికిత్స పొందుతుండగా, ఆదివారం మరో తొమ్మిది మంది కొత్తగా చేరారు.

➡️