మరో ఇద్దరు మృతి -విజయవాడలో విస్తరిస్తున్న అతిసార

Jun 1,2024 08:37 #diarrhea, #spreading, #Vijayawada

-15 రోజుల్లో 8 మంది మృత్యువాత
ప్రజాశక్తి- విజయవాడ, అజిత్‌సింగ్‌నగర్‌ :విజయవాడ నగరంలో అతిసార పలు ప్రాంతాలకు రోజురోజుకూ విస్తరిస్తోంది. మొదటగా మొగల్రాజపురంలో వెలుగుచూసిన అతిసార… ఆ తర్వాత పాయకాపురం ప్రాంతానికి విస్తరించింది. దీంతో, మరణాల సంఖ్య పెరుగుతోంది. పదుల సంఖ్యలో బాధితులు వివిధ ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇద్దరు మరణించడంతో గత పదిహేను రోజుల్లో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పాయకాపురం రాధానగర్‌కు చెందిన చౌదరి కనకమ్మ (60) గత వారం రోజుల నుంచి వాంతులు, విరోచనాలతో బాధపడుతూ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందింది. మొగల్రాజపురం గుమ్మడి వారి వీధికి చెందిన మెట్టు అంజమ్మ (70) గత మూడు రోజుల నుంచి నగరంలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఈ రెండు ప్రాంతాలకు చెందిన సుమారు 50 మందికిపైగా బాధితులు వివిధ ప్రయివేటు ఆస్పత్రుల్లోనూ, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. గత పదిహేను రోజుల్లో మొగల్రాజపురానికి చెందిన శిఖా ఇందిర (36), వల్లూరి దుర్గారావు (46), కాకర్లమూడి ఇందిర (55), ఇడుపుల కల్యాణ్‌ (26), పాయకాపురానికి చెందిన రామవరపు సన్యాసమ్మ (80), యడ్లపల్లి వినరు సిద్ధార్థ (7 నెలలు) అతిసారతో మరణించారు.
కలుషిత నీరే కారణం
గత రెండు నెలలుగా నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతోంది. భవానీపురంలోని హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్ద నుండి నీటిని శుద్ధిచేయకుండా పంపిణీ చేస్తున్న నీరు రంగుమారి వస్తోందని, బురద నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదులు చేసినా నగర పాలక సంస్థలో పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. దీనికితోడు నగరంలో డ్రెయినేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతోపాటు అనేకచోట్ల పైపులు లీకై మురుగునీరు కలవడంతో అతిసార ప్రబలుతోందని చెబుతున్నారు.
మృతుల కుటుంబాలకు సిపిఎం నేతల పరామర్శ
అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు పలువురు బాధితులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి తదితరులు పరామర్శించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ కలుషిత నీటి వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, బాధితులను ఆదుకోవాలని, కలుషిత నీటిని అరికట్టాలని, కృష్ణ నది నుండి స్వచ్ఛమైన తాగు నీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కలుషిత నీటి వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, వందలాది మంది ఆస్పత్రుల పాలవుతున్నారని అన్నారు. మరికొందరు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఇళ్ల వద్ద ఉంటున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పాలక పార్టీ ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం తప్ప, సరైన విధంగా స్పందించడంలేదని విమర్శించారు.

➡️