‘కొటియా’ సమస్య ఇప్పటికైనా పరిష్కారమయ్యేనా?

-ఒడిశాలో బిజెపి, మన రాష్ట్రంలో టిడిపి కూటమి
-ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించేనా?
ప్రజాశక్తి- సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) :సుమారు ఐదు దశాబ్దాలుగా ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల మధ్య నలుగుతున్న కొటియా గ్రామాల వివాదం ఇప్పటికైనా పరిష్కారం అవుతుందా అనే చర్చ ప్రారంభమైంది. కేంద్రంలో ఎన్‌డిఎ కూటమి, ఒడిశాలో ఎన్‌డిఎ భాగస్వామ్యమైన బిజెపి ప్రభుత్వం, మన రాష్ట్రంలో ఎన్‌డిఎ భాగస్వామ్యమైన టిడిపి కూటమి ప్రభుత్వం ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సమస్యను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించి పరిష్కరించాలని కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బిజెపి గతంలో మాదిరిగా రెచ్చగొట్టే వైఖరి తీసుకుంటుందో? చర్చలకు సహకరిస్తుందో? అనే చర్చ మళ్లీ మొదలైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లోని 21 కొటియా గ్రామాల వివాదాన్ని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు అనేక ఏళ్ల క్రితం తీర్పు చెప్పింది. 1968 నుంచి ఇరు రాష్ట్రాల మధ్య కొటియా గ్రామాల వివాదం నడుస్తోంది. ఆ గ్రామాలు తమవేనని ఒడిశా ప్రజాప్రతినిధులు, అధికారులు వాదిస్తున్నారు. గతంలో రెండు రాష్ట్రాల అధికారులు, ఉద్యోగులు ఆ గ్రామాలకు సజావుగా రాకపోకలు సాగించే పరిస్థితి ఉండేది. గడిచిన మూడేళ్లుగా ఒడిశాలో అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న బిజెపి వైఖరి వల్ల వివాదం మరింత రచ్చకెక్కింది. మూడేళ్ల క్రితం జరిగిన మన రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో కొటియా గ్రామాల ఓటర్లను పాల్గననీయకుండా ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో వివాదం మళ్లీ రాజుకుంది. అప్పుడు మన రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు గట్టిగా ప్రతిఘటించడంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అప్పటి నుంచి ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు ఏదో ఒక పేరున కొటియా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. తద్వారా అక్కడి ప్రజలపై ఒత్తిడి పెంచాలని ఒడిశా చూస్తోందని మన రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది మే వరకు ఒడిశాలో బిజూ జనతాదళ్‌ ప్రభుత్వం, మన రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు, కొటియా గ్రామాల వివాదాన్ని పరిష్కరించే దిశగా అప్పటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి. అయినా, వివాదం కొలిక్కి రాలేదు.
రచ్చకెక్కించడంలో బిజెపి కీలకపాత్ర
కొటియా గ్రామాల వివాదాన్ని రచ్చకెక్కించడంలో ఒడిశాకు చెందిన బిజెపి నాయకులు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించారు. కొటియా గ్రామాల్లో ఒకటైన పట్టు చెన్నూరులో పర్యటించినకు వచ్చిన ఒడిశాకు చెందిన బిజెపి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌… ఆంధ్రా ఉద్యోగులను ఉద్దేశించి ‘ఆంధ్రా గో బ్యాక్‌’ అనడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. కొరాపుట్‌ జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులనూ ఆయన రెచ్చగొట్టారు. గత మూడేళ్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సంయమనంతో వ్యవహరించారు.
ఖనిజ సంపద వల్లే వివాదం!
కొటియా గ్రామాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద వల్లనే రెండు రాష్ట్రాలు పట్టు వీడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వివాదాస్పదంగా ఉన్న కొన్ని గ్రామాల్లో బాక్సైట్‌, మాంగనీస్‌, బంగారం ఖనిజాలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.

➡️