ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులు అనర్హులు – హైకోర్టు స్టే

Feb 21,2024 22:17 #AP High Court, #DSC Notification
high court on sand mining
-ఈ ఉత్తర్వులు టెట్‌ నిర్వహణకు అడ్డంకి కాదని వెల్లడి
ప్రజాశక్తి-అమరావతి :స్పెషల్‌ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జిటి) పోస్టుల భర్తీకి బిఇడి అభ్యర్థులు అర్హులని హైకోర్టు పేర్కొంది. బిఇడి చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వ నిబంధనల అమలును నిలిపేస్తూ స్టే విధించింది. ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణ కోసం ప్రభుత్వం జారీ చేసిన జిఓ 4కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ కొనసాగించవచ్చునని చెప్పింది. ప్రతివాదులైన పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ) సభ్య కార్యదర్శి కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను ఏప్రిల్‌ 29కి వాయిదా వేసింది. చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం మధ్యంతర స్టే విధించింది.తొలుత ప్రభుత్వం తరఫున ఎజి ఎస్‌ శ్రీరామ్‌ వాదిస్తూ.. బిఇడి అభ్యర్థులకు అనుమతినివ్వడంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని, ఈ వ్యవహారంపై స్టే ఇస్తే అభ్యంతరం లేదని చెప్పారు. ఎస్‌జిటి పోస్టుల భర్తీ నిమిత్తం ఈ నెల 12న జారీ చేసిన జిఓ 11లో ఎస్‌జిటి పోస్టులకు బిఇడి అభ్యర్థులను కూడా అర్హులుగా పేర్కొన్న నిబంధన 5(2) వరకు మాత్రమే స్టే విధించవచ్చునని చెప్పారు. పిటిషనర్లు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని చెబుతున్న ఆ పార్టు వరకు స్టే ఇవ్వొచ్చునని చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు.. స్టే ఉత్తర్వుల వల్ల డిఎస్‌సి నిర్వహణ యథాతథంగా కొనసాగించవచ్చునని చెప్పింది. స్టే అడ్డంకి కాబోదని తెలిపింది.డిఎస్‌సి దరఖాస్తు గడువు పొడిగింపుడిఎస్‌సిా2024 ఫీజు, దరఖాస్తు తేదీల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. బుధవారంతో ముగిసిన ఫీజు గడువును, గురువారంతో ముగుస్తున్న దరఖాస్తు గడువును ఈ నెల 25వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగిస్తున్నట్లు కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి దరఖాస్తుల్లో తప్పులుంటే సవరించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థి పేరు, సెలెక్ట్‌ చేసుకున్న పోస్ట్‌, జిల్లా మినహా మిగిలిన అంశాల్లో మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. అభ్యర్థి పేరులో తప్పులుంటే పరీక్షా కేంద్రంలో నామినల్‌ రోల్స్‌పై సంతకం చేసే సమయంలో సరిచేసుకోవచ్చునని వెల్లడించారు. ఫీజు చెల్లించి జనరల్‌ నెంబర్‌ రాని వారికి ఐదు రోజుల్లో అభ్యర్థి నగదును వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని పేర్కొన్నారు. కేంద్ర టెట్‌ మార్కులు కాకుండా ఎపి టెట్‌ అర్హత కలిగిన అభ్యర్థులు వారి హాల్‌ టిక్కెట్‌ నెంబర్లను నమోదు చేస్తే సరిపోతుందని వివరించారు. ఇప్పటి వరకు టెట్‌కు 3,17,950 మంది, డిఎస్‌సికి 3,19,176 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.
➡️