జంపింగుల జోరు

Jan 11,2024 07:06 #ap cm jagan, #mp kesineni nani
  • టికెట్‌ రాకపోవడంతో పక్క పార్టీలవైపు చూపు
  • వైసిపిలోకి కేశినేని నాని
  • వైసిపికి కర్నూలు ఎంపి సంజీవ్‌ రాజీనామా
  • జనసేన అధినేతను కలిసిన అంబటి రాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ నాయకుల జంపింగులు జోరందుకున్నాయి. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం రాకపోతే ఇతర పార్టీల్లోకి జంప్‌ చేస్తున్నారు. టికెట్‌ రాదని తెలియడంతో కొందరు ముందుగా పార్టీ ఫిరాయింపులకు సిద్ధమయ్యారు. ఏ పార్టీ టికెట్‌ ఇస్తుందో తెలుసుకుని జంప్‌ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ మారడంతోపాటు ప్రస్తుతం ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తూ చేరిన పార్టీలను, ఆ పార్టీ అధినేతలను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానికి ఆ పార్టీ అధిష్టానం విజయవాడ లోక్‌సభ సీటును నిరాకరించడంతో ఆయన వైసిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. నాని సోదరుడు చిన్నికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంతో టిడిపి కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. దీంతో వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని కలిశారు. అలాగే కర్నూలు ఎంపి సంజీవ్‌ కుమార్‌ వైసిపికి రాజీనామా చేశారు. తన సన్నిహితులతో చర్చించి ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా ఖాళీ అయిన కాంగ్రెస్‌ పార్టీలోకి పదేళ్ల తరువాత వలసలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు డేవిడ్‌ రాజు, డివై దాస్‌ కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరడంతో మరికొంత మంది ఆ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల వైసిపికి గుడ్‌బై చెప్పిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. పెనమలూరు వైసిపి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించకపోతే ఎంపి లావు కృష్ణదేవరాయలు వైసిపికి రాజీనామా చేసి టిడిపిలో చేరే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వైసిపిలో చేరిన పదిరోజులకే రాజీనామా చేసిన క్రికెటర్‌ అంబటి రాయుడు ఇటీవల చర్చనీయాంశంగా మారారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఎన్నికల తేదీలు దగ్గర పడేకొద్ది ఈ జంపింగులు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చంద్రబాబు మోసగాడు : కేశినేని నాని

విజయవాడ అంటే తనకు ఎంతో ప్రేమ అని, చంద్రబాబు మోసగాడు అని ఎంపి కేశినేని నాని విమర్శించారు. టిడిపి కోసం ఎంతో శ్రమించినా అవమానాలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా ఉన్న సిఎం జగన్‌ వెంట వుండాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన కుటుంబంలో చిచ్చుపెట్టి కొట్టించాలని చూశారని ఆరోపించారు. అమరావతి కడతానని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని పేర్కొన్నారు. విజయవాడ నిజం అయితే అమరావతి ఒక కల అని అన్నారు.

నియోజకవర్గ సభ్యులకు ఏమీ చేయలేకపోయా : సంజీవ్‌

పార్లమెంటు సభ్యునిగా తన నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయానని కర్నూలు ఎంపి సంజీవ్‌ కుమార్‌ అన్నారు. సమస్యలు సిఎం దృష్టికి తీసుకెళ్తే ‘ఎమ్మెల్యేలు చూసుకుంటారు మీరు చూస్తూ ఉండండి’ అని అనడం తనకు బాధించిందన్నారు.

పవన్‌ భావజాలం నాది ఒక్కటే : రాయుడు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సిద్ధాంతాలు, ఆలోచనలు, తన భావజాలం, ఆలోచనలు ఒకేలా అనిపించాయని అంబటి రాయుడు ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పేర్కొన్నారు. తన భావజాలానికి, వైసిపి సిద్ధాంతాలకు ఏమాత్రం సారుప్యత లేదని గ్రహించి ఆ పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. రాజకీయాలను వదిలేద్దామనుకున్నానని, తన సన్నిహితుల సూచనతో పవన్‌ను కలిశానని వివరించారు

➡️