సీఎం జగన్‌పై దాడి.. ఈసీ కీలక ఆదేశాలు

Apr 14,2024 17:26 #Election Commission, #orders

అమరావతి : వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. కాగా జగన్మోహన్‌ రెడ్డిపై జరిగిన ఈ దాడికి కారణం టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా పుత్తూరులో రోడ్డుపై భైఠాయించి జగన్‌పై జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఎన్నికల సంఘం ఈ ఘటనపై స్పందించాలని, నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక ప్రతిపక్ష నేతలు సైతం ఈ జగన్‌పై దాడిని ఖండిస్తున్నారు. కాగా ఈ ఘటనపై భారత ఎన్నికల సంఘం స్పందించింది. సీఎం జగన్‌పై జరిగిన దాడి గురించి ఆరా తీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివారాలు తమకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీఐ ఆదేశించింది. ఇక చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ సభ, అలానే ఇప్పడు సీఎం రోడ్డుషోలో భద్రతా వైఫల్యాలపై భారత ఎన్నికల సంఘం ప్రశ్నించింది. రాజకీయాలపరంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

➡️