వ్యవసాయ కార్మికుల వాహనం బోల్తా

– ఒకరు మృతి, 20 మందికి తీవ్రగాయాలు
ప్రజాశక్తి-ఆలూరు :వ్యవసాయ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో కార్మికులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు… కర్నూలు జిల్లా హులేబీడు గ్రామానికి చెందిన 41 మంది వ్యవసాయ కార్మికులు చిప్పగిరి మండలంలోని ఓ గ్రామంలో మిరప పంట కోసేందుకు టాటా ఏస్‌ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కర్నూలు జిల్లా ఆలూరుాగుంతకల్‌ రోడ్డు మార్గంలో హత్తిబెళగల్‌ బస్టాండ్‌ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం టైర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో అదుపుతప్పి వాహనం బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మస్తానమ్మ (40) మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

➡️