సాబ్జీ జీవిత నేపథ్యం

Dec 16,2023 10:15 #MLC, #SK Sabji

 

ప్రజాశక్తి – యంత్రాంగం : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో షేక్‌ కబీర్‌ షా, షేక్‌ సైదా బీబీ దంపతులకు 1966 జనవరి ఐదో తేదీన సాబ్జీ జన్మించారు. సాబ్జీ కుటుంబంలో నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం విశేషం. ప్రాథమిక విద్యాభ్యాసం గూటాలలో, దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో, ఆరు నుండి పదో తరగతి వరకు దేవరపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో, ఇంటర్‌ తాడేపల్లిగూడెం డిఆర్‌ గోయంకా కళాశాలలో, బిఎస్‌సి డిగ్రీ రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో, టిటిసి ఏలూరు ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి దూరవిద్య ద్వారా బిఎడ్‌ విద్య అభ్యసించారు. 1989 డిఎస్‌సి ద్వారా ఎంపికై 1989 ఆగస్టు రెండో తేదీన చాగల్లు మండలం ఊనగట్ల ప్రాథమిక పాఠశాలలో స్పెషల్‌ టీచర్‌గా విధుల్లో చేరారు. 1989 సెప్టెంబర్‌ 24 నుండి రెగ్యులర్‌ సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయునిగా పని చేశారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే వరకూ ఏలూరు రూరల్‌ మండలం మాదేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేశారు. ఆయన భార్య సుభాని ప్రస్తుతం పెదపాడు మండలం వసంతవాడ స్కూల్‌లో ఉపాధ్యాయురాలుగా, కుమారుడు ఆజాద్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కుమార్తె అస్రిఫ్‌ అమెరికాలో ఉంటున్నారు.ఉద్యమ నేపథ్యం 1990లో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌)లో ప్రాథమిక సభ్యునిగా చేరి 1996 జనవరి నుండి జిల్లా కార్యదర్శిగా, 2003-04లో జిల్లా అధ్యక్షునిగా, 2005 నుండి 2015 వరకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2011 నుండి రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర విభజన అనంతరం 2014 నుంచి రాష్ట్ర గౌరవాధ్యక్షునిగా పని చేశారు. 2017 డిసెంబర్‌ 11న శ్రీకాకుళంలో జరిగిన 15వ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై ఎంఎల్‌సిగా ఎన్నికయ్యే వరకూ ఆ బాధ్యతల్లో ఉన్నారు. 2018 మేలో జరిగిన స్కూల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) ఏడో మహాసభలో జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. సంఘం నిర్ణయం మేరకు ఐదేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని 2021 మార్చిలో జరిగిన ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

 

నివాళులర్పిస్తున్న శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు

➡️