15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

Apr 9,2024 01:03 #fishing, #Stopped

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సముద్ర జలాల్లో యాంత్రిక పడవులు, మెకనైజ్డ్‌ మోటారు బోట్లు ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఈ నెల 15 నుంచి జూన్‌ 14 వరకు (61 రోజులు) పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు సోమవారం, మత్స్యశాఖ కమిషనరు ఎ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. చేప, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేప, రొయ్యలను సంరక్షించుకోవడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా సముద్ర మత్స్య సంపద, సుస్థిరతను సాధించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఆయా బోట్ల యజమానులను సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం 1994 సెక్షన్‌ (4)ను అనుసరించి శిక్షార్హులని పేర్కొన్నారు. అటువంటి వారి బోట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బోట్లలో ఉండే మత్స్య సంపదను స్వాధీనపర్చుకుంటా మన్నారు. అంతేకాకుండా జరిమానా విధించడం, డీజిల్‌ ఆయిల్‌ రాయితీ, ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలను నిలుపుదల చేస్తామన్నారు. నిషిద్ధ కాలాన్ని కచ్ఛితంగా అమలు చేసేందుకు మత్స్యశాఖ, కోస్ట్‌ గార్డు, కోస్టల్‌ సెక్యూరిటీ పోలీసులు, నేవీ, రెవెన్యూ అధికారులతో గస్తీ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️