ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి : సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

cpm letter to cm jagan on krishnapatnam port
  • సిఎంకు వి. శ్రీనివాసరావు లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రాష్ట్రంలోని ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసిందని, ఇందులో ఎస్‌టిలకు 1.025 పోస్టులు, 5వ షెడ్యూలు ఏరియాలో 500 పోస్టులు భర్తీచేస్తామని జనరల్‌ డిఎస్‌సి నిబంధనల్లో పేర్కొన్నారని తెలిపారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 175 పోస్టులకుగాను ఏడు పోస్టులు, రంపచోడవరంలో, చింతూరు ఏజెన్సీకి 205 పోస్టులకుగాను 10 పోస్టులు ఎస్‌టిలకు, సీతంపేట ఏజెన్సీలో 35 పోస్టులకు ఆరుపోస్టులు మాత్రమే ఎస్‌టిలకు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే కెఆర్‌పురం ఐటిడిఎ పరిధిలో 70 పోస్టులకు ఎనిమిది పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారని తెలిపారు. . ఏజెన్సీ ప్రాంతానికి 500 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామంటూ చివరికి ఆదివాసీ నిరుద్యోగులకు కేవలం 38 పోస్టులు కేటాయించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని పున:పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు. నాన్‌ షెడ్యూలు ఏరియాలో ఎస్‌టిలకు 300 పోస్టులకు కేటాయించిందని, గిరిజన గురుకులం నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ డిఎస్‌సిలో గురుకులం పోస్టులను విలీనం చేసిందని తెలిపారు. గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం పిజిటి 58 పోస్టులు, టిజిటి 446 పోస్టుల భర్తీకి నోటిషికేషన్‌ జారీచేయడం దారుణమన్నారు. గిరిజన గురుకులంలో జోనల్‌ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీచేస్తారని, కానీ జనరల్‌ డిఎస్‌సి మాత్రం జిల్లా యూనిట్‌గా నోటిఫికేషన్‌ జారీచేశారని తెలిపారు. గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్‌ చేయకుండా జనరల్‌ డిఎస్‌సి ద్వారా స్కూల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులైన ఆదివాసీలను గెంటి వేయొద్దని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పిస్తున్న జిఓ నెంబరు మూడును సుప్రీం కోర్టు రద్దు చేయడంపై 2020లో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుండి 17 రివ్యూ పిటీషన్లు దాఖలయ్యాయని తెలిపారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూలు క్లాజ్‌(2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌(టిఎసి)లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమశాఖ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. టిఎసి తీర్మానాన్ని కూడా కనీసం గౌరవించలేదని పేర్కొన్నారు., మరోపక్క జనరల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన అభద్రతాభావం, ఆందోళన కలిగిస్తోందని తెలిపారు జిఓ నెంబరు మూడు రద్దు చేసిన తరువాత అనేకమార్లు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిందని, ఏనాడూ 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్‌కు చట్టబద్ధత అంశంపై ప్రస్తావన చేయలేదని తెలిపారు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలు ఏరియాలో ఆదివాసలుకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఏ ఉత్తర్వులైనా ఐదో షెడ్యూలు క్లాస్‌(1)(2) ప్రకారం గవర్నర్‌, టిఎసి అనుమతి తప్పకుండా తీసుకోవాలని, కానీ జనరల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ జారీపై ఇటువంటి ప్రక్రియను దిక్కరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఆదివాసులకు ప్రత్యేక భాష, సంస్కృతి ఉందని, గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్థికల్‌ 29, 32 ఉల్లంఘించినట్లు అవుతుందని, ఇటీవల కాలంలో 1998, 2008లో సుమారు 400 లో 280 ఎస్‌జిటి పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్‌స్కేల్‌ ప్రాతిపాదికన స్థానికేతరులతో ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రభుత్వ చర్యవల్ల ఇప్పటి వరకూ ఉపాధి పొందుతున్న గిరిజన గురుకులంలో ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు 504 మంది, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిఆర్‌టి ఉద్యోగం నిర్వహిస్తున్న 521 మంది ఉద్యోగం కోల్పోయి వారి స్థానంలో గిరిజనేతరులతో ప్రభుత్వం భర్తీ చేస్తోందని తెలిపారు. 1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు రెండుశాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95 శాతం పోస్టులు భర్తీ చేయడం, 98 శాతం ఉన్న ఆదివాసుల కోసం ఐదుశాతం పోస్టులు మాత్రమే కేటాయించి భర్తీ చేయడం తగదని తెలిపారు. దీనిపై వెంటనే జనరల్‌ డిఎస్‌సి నోటిఫికేషన్‌ను పున:పరిశీలించి ఏజెన్సీ ప్రాంతం ఆదివాసీ నిరుద్యోగులకు భద్రత, భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయడానికి వెంటనే ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించాలని, అందుకు ఆర్డినెన్స్‌ జారీచేయాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

➡️