జనసేన, టిడిపి పొత్తుపై భగ్గుమన్న అసమ్మతి

Jan 18,2024 10:36 #JanaSena, #TDP
  • మూడో స్థానంలో ఉన్న నాదెండ్లకు సీటు ఇవ్వొద్దు
  • తెనాలిలో అలపాటి అనుయాయుల భేటి

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : టిడిపి, జనసేన పొత్తులో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానాన్ని మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు కేటాయిస్తూ జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయంపై అసమ్మతి స్వరం పెరిగింది. పొత్తులో తెనాలిని టిడిపికే కేటాయించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అనుయాయులు డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఎన్‌విఆర్‌ కన్వెన్షన్‌లో తాడిబోయిన హరిప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన అత్యవసర సమావేశంలో తెనాలి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడాన్ని వ్యతిరేకించారు. తెనాలి సీటు విషయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పున:పరిశీలించాలని కోరారు. వైసిపి వ్యతిరేక ఓటు చీలకుండా అధికార మార్పునకు కృషి చేస్తానన్న పవన్‌కల్యాణ్‌ దానికి అనుగుణంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన నాదెండ్ల మనోహర్‌కు కేవలం 15 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తుచేశారు. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సర్వే చేయించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెనాలిలో గెలుపు కోసం టిడిపికి అవకాశం ఇవ్వాలని, తెనాలి సీటు కేటాయింపు విషయంలో జనసేన, టిడిపి నాయకత్వాలు పున:పరిశీలించాలని కోరారు. సభలో నన్నపనేని సుధాకర్‌, వంగా సాంబిరెడ్డి, మంగమూరి యుగంధర్‌, పెండెల వెంకట్రావ్‌, కె ఏడుకొండలు, బొబ్బిళ్లపాటి ప్రసాద్‌, మాదల కోటేశ్వరరావు, తాడిబోయిన శ్రీనివాసరావు, చల్లా పుల్లారావు ప్రసంగించారు.

➡️