శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం

Apr 26,2024 13:27 #srisailam

శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలంలో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజామున పూజల అనంతరం అర్చకులు అమ్మవారికి నవావరణ పూజ, త్రిశతి, అష్టోత్తర శతనామ కుంకుమార్చనలు నిర్వహించారు. ఆ తర్వాత కొబ్బరి, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పించారు. అదే సమయంలో హరిహరరాయ గోపురం వద్ద మహిషాసురమర్దిని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం కుంభోత్సవ కీలక ఘట్టం ప్రారంభం కానుంది. అమ్మవారి ఆలయ సింహ మండపం వద్ద అన్నాన్ని రాశిగా పోస్తారు. ప్రదోశకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేస్తారు. స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేసిన అనంతరం స్త్రీ వేషధారణలో ఆలయ ఉద్యోగి భ్రమరాంబాదేవికి కుంభహారతి సమర్పించనున్నారు. ఆ తర్వాత రెండో విడత సింహ మండపం వద్ద కొబ్బరి, గుమ్మడికాయలను సాత్విక బలిగా సమర్పిస్తారు. కుంభహారతి సమయంలో భ్రమరాంబాదేవికి అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను సమర్పించి శాంతి ప్రక్రియను నిర్వహించనున్నారు.

➡️