బిజెపిది డబుల్‌ ఫెయిల్యూర్‌ సర్కార్‌

May 10,2024 21:52 #BV Raghavulu, #speech

– ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను విజన్‌-22లో చేర్చింది చంద్రబాబే
– స్వేచ్ఛ,Û ప్రజాస్వామ్యం అంటే ఏమిటో పవన్‌కు తెలుసా?
– ప్రజాస్వామ్యం, లౌకికతత్వం బతకాలంటే ‘ఇండియా’తోనే సాధ్యం
– భీమవరం బహిరంగ సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు
ప్రజాశక్తి – భీమవరం :చంద్రబాబు పదేళ్లపాటు, జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్లపాటు బిజెపి పంచన, చంకన ఉన్నప్పుడు లేని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందని, బిజెపి చెప్పుకునే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ కాదని.. అది డబుల్‌ ఫెయిల్యూర్‌ సర్కార్‌ అని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు విమర్శించారు. సిపిఎం, సిపిఐ, ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక కొత్త బస్టాండ్‌ దగ్గర నుంచి అన్నపూర్ణ థియేటర్‌, పోలీస్‌ బమ్మ సెంటర్‌ మీదుగా ప్రకాశం చౌక్‌ వరకూ సాగిన ఈ ప్రదర్శనలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాఘవులు మాట్లాడుతూ.. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరగాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బిజెపి, వైసిపి విడివిడిగా పోరాడుతున్నా అవి దొందూదొందేనని, వారి విధానాలు ఒకటేనని విమర్శించారు. కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు మోడీ ప్రభుత్వం తీసుకొస్తే టిడిపి, వైసిపి ఎంపిలు కనీసం నోరెత్తకుండా వాటిని ఆమోదించారన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును బిజెపి తీసుకొస్తే దాన్ని రాష్ట్రంలో జగన్‌ ఆమోదించి అమలు చేశారని, అప్పట్లో ప్రపంచ బ్యాంకు అప్పు కోసం విజన్‌-22లో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కోసం చంద్రబాబు రాశారని గుర్తు చేశారు. జగన్‌ కూడా మోడీపై విమర్శలు చేయకుండా ఎన్‌డిఎను తిట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వేచ్చ,Û ప్రజాస్వామ్యం, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని ఇటీవల విశాఖపట్నంలో పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారని, వాటి గురించి పవన్‌కు ఏం తెలుసని ప్రశ్నించారు. బిజెపి, టిడిపి, వైసిపి పాలనలో సిపిఎం, సిపిఐలు అనేక ఇబ్బందులు పడ్డాయని, చివరకు ముఖ్యమంత్రి పర్యటనకొచ్చినా ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధిస్తున్నారని అన్నారు. సిఎఎపై కనీసం నోరు మెదపని ఈ మూడు పార్టీలూ ఆ చట్టానికి మద్దతు తెలపడం దుర్మార్గమన్నారు. మోడీ అమలు చేస్తున్న పౌరసత్వం చట్టంపై మాట్లాడని టిడిపి, వైసిపి జనసేన పార్టీలు మైనార్టీలు, ముస్లింలకు అండగా ఉంటామని చెప్పడానికి సిగ్గులేదా? అని నిలదీశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేట్‌పరం చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు నిర్మించకపోయినా, విశాఖకు రైల్వేజోన్‌ లేకపోయినా, కడపకు స్టీల్‌ ఫ్యాక్టరీ ఇవ్వని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం బతకాలంటే ఇండియా వేదికకు అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రలోభాలకు లంగకుండా కార్మిక వర్గం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఇండియా వేదిక హవా కొనసాగడంతో మోడీకి భయం పట్టుకుందన్నారు. జగన్‌ కూడా రాష్ట్రంలో ఈ విధంగానే భయపడుతున్నారని చెప్పారు. ఇండియా వేదిక అధికారంలోకి రావాలంటే ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సభలో మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, నర్సాపురం కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి కెబిఆర్‌.నాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపి మల్చంద్‌ మినా, భీమవరం, ఉండి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులు అంకెం సీతారం, వేగేశ్న గోపాలకృష్ణంరాజు, సిపిఎం జిల్లా నేతలు జెఎన్‌వి గోపాలన్‌, చింతకాయల బాబూరావు, బి. వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

➡️