బిజెపితో దేశానికి ముప్పు

  • రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి
  • రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌ (అల్లూరి జిల్లా) : బిజెపితో దేశానికి ముప్పు పొంచి ఉందని, అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చే కుట్రలు జరుగుతున్నాయని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. దేశంలోని మైనారిటీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఈ విషయాలను లోతుగా అవగాహన చేసుకుని సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని, దానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిస్తున్న టిడిపి, జనసేన, వైసిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా వేదికలోని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలోని ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ అధ్యక్షతన బుధవారం ప్రజా అవగాహన సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చూస్తున్నారని విమర్శించారు. రైతాంగం, కార్మికుల పట్ల నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులను కాలరాస్తున్నారన్నారు. చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి వేశారని తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఐదో షెడ్యూల్లో పేర్కొన్న అంశాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ గిరిజనుల భూములను లాక్కొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల పేరిట వాటిని కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు యత్నిస్తున్నారని అన్నారు. ఆ చర్యలను వ్యతిరేకించకపోతే గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని తెలిపారు. సిసిఎం అరకు ఎంపీ అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ కె.విజయరావు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీని, దాని తొత్తు, పొత్తు పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించిన దాఖలాలులేవన్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపిలు పరస్పరం విమర్శించుకోవడానికే పరిమితమవుతున్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మోడీ ప్రయివేటుపరం చేస్తుంటే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు, మాజీ ఐఎఎస్‌ అధికారి శ్రీనివాస్‌, రంగారెడ్డి, విభజన హామీల సాధన సమితి నాయకులు అప్పలనాయుడు, సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️