ఫాసిస్టు ధోరణిలో బిజెపి పాలన

May 10,2024 17:46 #kishore

ఎన్‌డిఎతో దేశానికి ప్రమాదం ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం అభ్యర్థులను గెలిపించాలి
మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్
అరకు : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, దానికి మద్దతు ఇస్తున్న ఎన్‌డిఎ ద్వారా దేశానికి ఎంతో ప్రమాదఘంటికలు ఉన్నాయని మాజీ కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ విమర్శించారు. ఇండియా బ్లాక్‌ బలపర్చిన కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నరసను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రలో శుక్రవారంనాడు ఇరువురు అభ్యర్థులను ఆయన మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కిశోర్‌ చంద్రదేవ్‌ మాట్లాడుతూ బిజెపి పాలన పూర్తిగా ఫాసిస్టు ధోరణితో సాగుతోందన్నారు. ఎదురుతిరిగే వారిని బెదిరించటం, అక్రమ కేసులు బనాయియించటం, జైళ్లలో మగ్గిపోయేలా చేస్తున్నారన్నారు. ఆఖరికి ముఖ్యమంత్రులు శిబుసోరెన్‌, కేజ్రీవాల్‌లను జైళ్లలో పెట్టడం దుర్మార్గ పూరితమన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రమాదకరమైన బిజెపితో కలవటం వల్ల ఆ పార్టీకి తాను రాజీనామా చేశానన్నారు. బిజెపి ప్రభుత్వ పదేళ్లకాలంలో దేశంలో లౌకిక వ్యవస్థకే పెనుసవాళ్లు ఏర్పడుతున్నాయన్నారు. దేశంలో లౌకికవాదం మరింతగా ఫరిఢవిల్లాలంటే ఇండియా బ్లాక్‌ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. ఎన్‌డిఎ కూటమిలో టిడిపి చేరటం చాలా దురదృష్ట సంఘటనగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, దేశ లౌకిక వాదానికి కట్టుబడే తాను బయటకు వచ్చానన్నారు. లౌకికవాదం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక న్యాయం. ఫెడరలిజం-కేంద్ర, రాష్ట్ర సంబంధాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. కొంతమంది పెట్టుబడిదారులకు మేలుచేస్తూ సామాన్యుల హక్కులను బిజెపి పాలకులు తుంగలోకి తొక్కుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వ కబంధ హస్తాల్లో ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు కూరుకుపోయాయన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీయుల హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా ప్రజానీకాన్ని విభజించే ప్రయత్నాలు బిజెపి పాలకులు చేస్తున్నారన్నారు. తాను మొదటి నుంచి అభ్యుదయ వాదంతో, పేదలకు అండగా నిలుస్తూ వస్తున్నానన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, గిరిజనులు, ఆదివాసీ హక్కులను కాపాడేందుకు ఇప్పటివరకు కృషిచేశానన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన సమయంలో కూడా వారి హక్కులను కాపాడటానికి తనవంతుగా చర్యలు తీసుకున్నానన్నారు. ఆదివాసీల హక్కులను కాలరాయటం, చట్టాలను మార్చటం ద్వారా అటవీ ప్రాంతాల్లో ఉండే బాక్సైట్‌, మైనింగ్‌ను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బిజెపి పాలకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలు సైతం కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు. నేషనల్‌ ఫ్రంట్‌ హయాంలో కూడా తాను ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషిచేశానన్నారు. 2014 ఎన్నికలకు ముందు తమకు అధికారం కట్టబెడితే విదేశాల్లో ఉన్న లక్షలాది కోట్ల నల్లధనాన్ని తీసుకొచ్చి దేశంలోని ప్రతిఒక్కరి అకౌంట్లలో రూ. 15 లక్షలు చొప్పున జమ చేస్తామని మోడీ అప్పట్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి పదేళ్ళవుతున్నా నల్లధనం ఊసే ఎత్తటం లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయటం, లేదా కార్పొరేట్‌, ప్రయివేటు సంస్థలకు కారుచౌకగా విక్రయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఎన్నికల కమిషన్‌ను సైతం ప్రభావితం చేసేలా మోడీ చర్యలు ఉంటున్నాయన్నారు. నోట్లరద్దు, ఇతర సంస్కరణల ద్వారా రిజర్వుబ్యాంకు నుంచి కూడా డబ్బు కార్పొరేట్‌ సంస్థలను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి మండంగి రమణ, అరకు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న పాచిపెంట అప్పల నర్స కూడా మాట్లాడారు.

➡️