రాహుల్‌కి బిజెపి క్షమాపణ చెప్పాలి

Jan 22,2024 08:43 #Dharna, #Rahul Gandhi, #ys sharmila
  • విశాఖ నిరసన దీక్షలో షర్మిల

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : అసోంలో రాహుల్‌ గాంధీ చేపట్టిన న్యాయయాత్రను అడ్డుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్‌ పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. ఇందుకుగానూ బిజెపి, అసోం ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ప్రజల హక్కులకు భంగం వాటిల్లడంతో ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్‌ యాత్ర కొనసాగిస్తున్నారని, బిజెపి గూండాలు దీనిని అడ్డుకుని, దాడులు చేసి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను గాయపర్చడం శోచనీయమన్నారు. దీనిపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాహుల్‌ న్యాయయాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా విశాఖలో జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం రాత్రి ఆమె నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ మోడీకి కేవలం బిజెపి వాళ్లు మాత్రమే కావాలని, తనకు జై అన్న వాళ్లే ఉండాలని సంకల్పం పెట్టుకున్నారని విమర్శించారు. ఈ దేశంలో మరెవరూ మిగలకూడదన్నది ఆయన ఆలోచన అని దుయ్యబట్టారు. అసోంలో ఉన్నది బిజెపి ముఖ్యమంత్రి అని, అందుకే రాహుల్‌ యాత్రను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంపులుగా వచ్చి దాడి చేయడాన్ని ఖండించారు. ఎక్కడో అయోధ్యలో మోడీ పూజలు చేస్తే, అసోంలో రాహుల్‌ను గుడికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యం కాదని అన్నారు. అందుకే గాంధీ విగ్రహం వద్దే నిరసనకు దిగినట్లు తెలిపారు. తొలుత ఆమె గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు.

➡️