దేశ శ్రేయస్సుకు బిజెపిని ఓడించాలి

Apr 30,2024 22:12 #2024 election, #campaign, #cpm election
  •  ప్రజా గళం వినిపించేందుకు సిపిఎంను బలపర్చండి
  •  వామపక్ష అభ్యర్థుల ప్రచారం

ప్రజాశక్తి-యంత్రాంగం : ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వ్యాపారులకు, ప్రజలను నమ్మి రాజకీయాల్లో ఉన్న వారికి మధ్య పోటీ జరుగుతోందని సిపిఎం అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పని చేసే అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిపిఎంను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వివరించారు.
కృష్ణా జిల్లా నున్నలో సిపిఎం గన్నవరం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మచిలీపట్నం ఎంపి అభ్యర్థి గొల్లు కృష్ణ నిర్వహించిన ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తున్న బిజెపిని, దానికి మద్దతిస్తున్న వైసిపి, టిడిపి, జనసేనలను ఓడించడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యమని తెలిపారు. మరోసారి బిజెపి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గొంతు నులుముతుందని హెచ్చరించారు. దేశాన్ని కార్పొరేట్‌ శక్తులపరం చేయడానికి శక్తి వంచన లేకుండా మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. టిడిపి, జనసేన పార్టీలు బిజెపితో జతకట్టడమంటే రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలను మోసం చేయడమేనన్నారు. నీతివంతమైన పాలన అందించేందుకు సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరారు.

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో చిగురుపాటి బాబూరావుకు మద్దతుగా ఆ పార్టీ కార్యకర్తలు కండ్రిక బస్టాండ్‌ నుండి సత్యనారాయణపురం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే సెంట్రల్‌ నియోజకర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోడీ మూడోసారి గెలిస్తే దేశం, రాష్ట్రం రెండూ నాశనమైపోతాయని హెచ్చరించారు.


పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండెంఖల్‌ సంతలో నిర్వహించిన ప్రచారంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బారావమ్మ పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రజలు అభివృద్ధికి నోచుకోవాలంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గిరిజన హక్కులను కాలరాస్తుంటే రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు దానికి మద్దతివ్వడం దారుణమన్నారు. గిరిజన సమస్యలపై పోరాడుతున్న కురుపాం అభ్యర్థి మండంగి రమణ, అరకు ఎంపి అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు.


కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గోరకల్లు, కొండజూటూరు, సుగాలిమెట్ట, భూపనపాడు, నెరవాడలో సిపిఎం పాణ్యం అభ్యర్థి డి.గౌస్‌దేశారు, కాంగ్రెస్‌ నంద్యాల పార్లమెంట్‌ అభ్యర్థి లక్ష్మినరసింహ యాదవ్‌ ప్రచారం నిర్వహించారు. కబ్జాకోరుగా, కాంట్రాక్టర్లకు కమిషన్‌ ఏజెంటుగా ఉన్న కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక అభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పాణ్యం నియోజకవర్గం అనుకూలంగా ఉన్నప్పటికీ బాధ్యత లేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండటం వల్ల ఉపాధి రహిత ప్రాంతంగా మారిందన్నారు. గెలిచిన సంవత్సరంలోపు పాణ్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.


నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్‌ కాలనీ, గాంధీగిరిజన కాలనీలో అభ్యర్థి మూలం రమేష్‌ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరోనా సమయంలో వలస కార్మికులకు భోజన వసతి కల్పించడమే కాకుండా, ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ఆదుకుంది సిపిఎం అని తెలిపారు. భగత్‌సింగ్‌ కాలనీలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ప్రభుత్వం పంపిణీ చేయడంలోనూ కీలక పాత్ర పోషించిందన్నారు. తనను గెలిపిస్తే నెల్లూరు నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.


గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో నియోజకవర్గ అభ్యర్థి జొన్నా శివశంకరరావు విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే ఎర్రజెండాకే ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో సిపిఎం రాష్ట్ర నాయకులు వి కృష్ణయ్య, వంకాయలపాటి శివనాగరాణి పాల్గొన్నారు.


విశాఖ గాజువాక నియోజకవర్గంలోని తుంగ్లాం, కాపు తుంగ్లాం, రెడ్డి తుంగ్లాం, చుక్కవానిపాలెం ప్రాంతాల్లో గాజువాక అభ్యర్థి ఎం.జగ్గునాయుడు ప్రచారం నిర్వహించారు. ప్రజా సమస్యలపై గొంతెత్తే నాయకులను అసెంబ్లీకి పంపాలని కోరారు.


అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలంలో అరకు ఎంపి అభ్యర్థి పి.అప్పలనర్స ప్రచారం నిర్వహించారు. ముంచంగిపుట్టు మండలం దారెల, కిలగాడ, గేదెలబందల్లోనూ, పెదబయలు మండలం కిముడుపల్లిలోనూ ప్రచారం చేశారు. అడ్డతీగల మండలంలో రంపచోడవరం అభ్యర్థి లోతా రామారావు ప్రచారం నిర్వహించారు.

➡️