పివిటిజిలకు బిజెపి ద్ర్రోహం

May 12,2024 08:08 #cpm v srinivasarao, #press meet

-వారి అభివృద్ధికి ఏం చేశారో, ఎన్ని నిధులు వెచ్చించారో చెప్పాలి?
-గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు
-అరకు పార్లమెంట్‌ స్థానంలో బిజెపి, వైసిపిలను ఓడించండి
-ఏజెన్సీ అంతటా సిపిఎం ఎంపి అభ్యర్థి అప్పలనర్సకు ఆదరణ : వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి- పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) :ఏజెన్సీలోని పివిటిజి గిరిజనులకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. పైగా, పెద్ద స్కీములు పెట్టి వారిని ఉద్ధరిస్తున్నామని మోడీ సర్కారు ప్రచారార్భాటాలు చేస్తోందని విమర్శించారు. పివిటిజిల అభివృద్ధికి ఏం చేశారో, ఎన్ని నిధులు వెచ్చించారో బహిర్గతం చేయాలని సవాలు విసిరారు. చివరకు అంత్యోదయ బియ్యం కూడా ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. శనివారం పాడేరులో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం అరకు లోక్‌సభ అభ్యర్థి పి.అప్పలనర్సను గెలిపించాలని కోరారు. ఇప్పటికే ఆయనకు ఆదివాసీల్లో ప్రజాదరణ పెరిగిందని, గెలిపిస్తే ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తాడని శ్రీనివాసరావు చెప్పారు. అరకు లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత ప్రస్తుతం ప్రజాదరణ కోల్పోయి ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారని తెలిపారు. వైసిపి అభ్యర్థి తనూజరాణి నియోజకవర్గానికిగానీ, సొంత గ్రామానికిగానీ చేసిన సేవలు ఏమీ లేవన్నారు. వారిద్దరి పట్ల ప్రజలు విముఖతతో ఉన్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆది నుంచీ ప్రజా పోరాటాలతో గిరిజనుల చట్టాలు, హక్కుల అమలుకు కృషి చేస్తోన్న అప్పలనర్స పట్ల ప్రజల్లో సదాభిప్రాయం ఏర్పడిందన్నారు. జిఒ నెంబర్‌ 3 రద్దులో బిజెపి హస్తం ఉందని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఐదో షెడ్యూల్‌ లేకుండా చేసి ఈ ప్రాంతంలోని సహజ సంపదలను అదానీ, అంబానీవంటి వారి పరం చేసేందుకు మోడీ కంకణం కట్టుకున్నారని వివరించారు. గిరిజన హక్కులు, చట్టాలు అమలు కాకుంటే మన్య ప్రాంతం ప్రత్యేకతలను కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భాషా వలంటీర్లను పాలకులు వంచించారన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బిజెపి ప్రభుత్వం సవరణలు తెచ్చిందని, అటవీ భూములను లాక్కునేందుకు కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో సిపిఎం నిరంతర పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యానికి మోడీ సర్కారు కుట్రలు పన్నుతోందన్నారు. ఇప్పుడిస్తున్న ఉపాధి కూలి పెరిగిన నిత్యావసర ధరల నేపథ్యంలో గిట్టుబాటు కావడం లేదని తెలిపారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే రోజుకు రూ.400 ఉపాధి వేతనం వచ్చేలా చూస్తుందన్నారు. నిరుద్యోగుల కోసం స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహిస్తుందని తెలిపారు. ఆదివాసీల ప్రయోజనాలను కాపాడలేకపోతున్న పాలకపక్షాలను ఓడించేందుకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారన్నారు. అరకు పార్లమెంట్‌లో బిజెపి, వైసిపిలను ఓడించి సిపిఎంను గెలిపించాలని కోరారు.
బిజెపి వస్తే మోదకొండమ్మ కాస్త మోడీ కొండగా మారుతుంది
అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలేసిన మోడీ ఈ ఎన్నికల్లో దేవుడి పేరుతో, మతం పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని శ్రీనివాసరావు విమర్శించారు. నమో అంటే నరేంద్ర మోడీ కాదని.. నమ్మించి మోసం చేసేవారని ఎద్దేవా చేశారు. పాడేరు ప్రాంతంలో ప్రజలు మోదకొండమ్మను ఎంతో పవిత్రమైన దేవతగా పూజిస్తారని, బిజెపి అధికారంలోకొస్తే మోదకొండమ్మ కాస్త మోడీ కొండగా మారిపోతుందని అన్నారు. దేవుళ్లను సైతం దురాక్రమణ చేసిన ఘనత మోడీదేనని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, నాయకులు జి.కోటేశ్వరరావు, బోనంగి చిన్నయ్య పడాల్‌, సుందరరావు పాల్గ్నొారు.

➡️