పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం

  • శ్రీ ప్రతి కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటా 
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 
  • స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజానికి చేయూనివ్వడానికి ముందడుగు వేస్తానని చెప్పారు.తమది ప్రజల ప్రభుత్వం అని అన్నారు. నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తామని, నిండు మనసుతో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని లభ్దిదారులకు పింఛన్‌ అందించారు. ఉదయం 6 గంటలకే మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలోని ఎస్టీ కాలనీకి చేరుకున్నారు. లబ్ధిదారులు బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబానికి మొదటగా చంద్రబాబు పింఛన్‌ అందించారు. నాయక్‌కు వృద్ద్యాప్య పింఛన్‌, కూతురు ఇస్లావతి బాయికి వితంతు పింఛన్‌, భార్య సీతాబాయికి రాజధాని కూలీ పింఛన్‌ అందించారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. తనకు ఇల్లులేదని నాయక్‌ చెప్పడంతో తక్షణమే ఇంటి నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. ఎస్టీ కాలనీలో స్థానికుల యోగక్షేమాలను సిఎం అడిగి తెలుసు కున్నారు. అనంతరం మసీదు సెంటర్‌లో నిర్వహిం చిన ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటించారు. ప్రజాస్వామ్యంలో న్యాయనిర్ణేతలు ప్రజలే అని ముఖ్యమంత్రి అన్నారు. గత ఐదేళ్లల్లో అణచివేతకు గురైన ప్రజలు ఇప్పుడు సమస్యలు చెప్పుకోవడానికి తనను కలుస్తున్నారని వివరించారు. ప్రజలకు తమపై చాలా ఆశలు ఉన్నాయని తెలిపారు. కానీ అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవని చెప్పారు. రాష్ట్రానికి ఎంత అప్పు ఉండో అర్ధం కావడం లేదన్నారు. పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లారని చెప్పారు. మురికి కాల్వ కూడా కనపడకుండా తెరలు కట్టారని, సమస్యలు దాస్తే దాగవని తెలిపారు.

ప్రజలకు సేవకులమే
తాము ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండేవాళ్లం కాదన్నారు. తమకు ప్రజలు ఇచ్చింది అధికారం కాదని, బాధ్యత అని చెప్పారు. పరిపాలనలో తాము కష్టపడైనా సరే సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని తెలిపారు. పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఖర్చుచేసి పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తామన్నారు. జీవన ప్రమాణాలు పెంచడానికి మొదటి అడుగు వేశామని, ఆర్ధిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రతి ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని హామీనిచ్చారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో పింఛన్‌ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇచ్చిందన్నారు. తాను సచివాలయ సిబ్బందితో పంచాలని చెబితే గత ప్రభుత్వం కుదర దని చెప్పిందని గుర్తుచేశారు. వృద్ధులను సచివాల యాల చుట్టూ తిప్పి 33 మంది ప్రాణాలు తీశారని, ఇంటింటికీ పింఛన్‌ ఇవ్వాలని తాము పోరాడినా విలేదన్నారు. అందుకే 1.20లక్షల మంది సచివాలయ సిబ్బందితో ఇప్పుడు అందిస్తున్నామని తెలిపారు. చేతకాదన్న అడ్మినిస్ట్రేషన్‌తోనే పింఛన్ల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదటిసారి పింఛన్‌ను రూ.35లతో ఎన్టీ రామారావు ప్రారంభించారని చెప్పారు. ఇప్పుడు రూ.4వేలకు పెరిగిందని, ఇందులో రూ.2,875ల టిడిపి ప్రభుత్వమే దశలవారీగా పెంచిందన్నారు. ఒక్క నెలలోనే పేదలకు పింఛన్ల కింద రూ.4,408కోట్లు అందిస్తున్నామని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదన్నారు. తవ్వుతున్న కొద్దీ నాటి ప్రభుత్వ తప్పులు, అప్పులు బయటపడు తున్నాయని చెప్పారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాల్సి ఉందని, ధరలు తగ్గిస్తే పేద కుటుంబాలకు వెసులుబాటు లభిస్తుందన్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీ మేరకు ఒకే రోజు ఐదు హామీలపై సంతకాలు చేశానని చెప్పారు. తమ ప్రభుత్వానికి మరింత శక్తినిస్తే మరింత సంక్షేమ అందిస్తుందని, అందరికీ అండగా ఉండే వెసుబాటును కల్పిస్తామని తెలిపారు. రాజధాని తరలిపోతుందని గతంలో ఇక్కడివారు బాధపడ్డారని, రాజధాని వస్తుందేమోనని విశాఖవాసులు భయపడ్డారని చెప్పారు. అధికారం ఉందని విర్రవీగితే ఏమవుతుందో గత పాలకుడికి పట్టిన గతిని చూస్తే తెలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచింది కాక మళ్లీ అడ్డగోలు వాదనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు అత్యాచారాలకు పాల్పడ్డా అదే చివరి రోజు అవుతుందని చెప్పారు. మద్యం గంజాయి మత్తులో ఏదిపడితే అది చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఇబ్బందులుంటే చెప్పండి : కోర్టులకు వెళ్లొద్దు
రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తమతో చెప్పాలని చంద్రబాబు కోరారు. కోర్టులకు వెళితే పనులు ఆలస్యమవుతాయని తెలిపారు. తమ ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసమే ఆలోచిస్తుందన్నారు. ఎప్పుడూ జరగని అభివృద్ధి మంగళగిరిలో చూపిస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో లోకేష్‌ మంగళగిరిలో ఓడిపోయారని వెల్లడించారు. అయినా పట్టు వదలకుండా మళ్లీ ఇదే నియోజకవర్గంలో పట్టు సాధించి ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు అమలు చేయడానికి, పేదిరకం లేని సమాజానికి పెనుమాక నుంచే సంకల్పం తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

పంపిణీలో రికార్డు: చంద్రబాబు
రాష్ట్రప్రభుత్వం పింఛన్ల పంపిణీలో రికార్డు సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95శాతానికి పైగా ఇంటింటికీ పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్‌ చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికార యంత్రాంగాన్ని, పింఛన్ల పంపిణీలో పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని అభినందించారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఒక్క రోజులో ఈ స్థాయిలో జరగలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

➡️