బిజెపికి తొత్తులుగా చంద్రబాబు, జగన్‌

  •  ఆశీర్వదించండి..సేవకురాలిగా ఉంటాను
  •  ఎన్నికల ప్రచారంలో పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : బిజెపికి తొత్తులుగా ఉంటూ రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్‌ సర్వనాశనం చేస్తున్నారన్నారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల విమర్శించారు. తాను పోటీచేస్తున్న కడప ఎంపి పరిధిలోని బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం నుంచి బుధవారం ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో షర్మిల మాట్లాడుతూ.. తనను కడప ఎంపిగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని, ప్రత్యేక హోదా సాధిస్తాని, ఒక్కసారి నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి గెలిపిస్తే మీకు సేవకురాలుగా పని చేస్తానని అన్నారు. వైఎస్‌ఆర్‌కు జగన్‌ వారసుడు ఎలా అవుతారని, వైఎస్‌ఆర్‌ ఆశయాలను ఒక్కటైన అమలు చేశారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా రైతులను అప్పుల పాలు చేశారని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయం పండుగలాగా ఉండేదని, నేడు రాష్ట్రంలో అప్పు లేని రైతు లేరని చెప్పారు. నిరుద్యోగ బిడ్డలను వంచనకు గురిచేశారని,. 2.35 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి, ఐదేళ్లు అధికారం అనుభవించి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయన్నారు. కడప ఎంపిగా ఆనాడు వైఎస్‌ఆర్‌, వైఎస్‌ వివేకా గెలిచారని, ఇప్పుడు వైఎస్‌ఆర్‌ బిడ్డ కడప ఎంపిగా పోటీ చేస్తోందన్నారు. సోమశిల ఎత్తిపోతల పథకం ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరిస్తామని చెప్పారని, ఇప్పటికీ ఒక్క చుక్క కూడా నీరివ్వలేదని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని వీళ్లు మనకు అవసరమా? అని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. పదేళ్ల బిజెపి పాలనలో ప్రజలను పది నయవంచనాలకు ప్రధాని మోడీ గురిచేశారన్నారు. దేశంలో 15 శాతం ఉన్న మైనార్టీల్లో కేంద్ర క్యాబినెట్‌లో ఒక్క మంత్రి కూడా లేకపోవడం శోచనీయమన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్‌ మాట్లాడుతూ.. వైసిపి పరిపాలన అంతా బిజెపి అడుగులకు మడుగులు వత్తడానికే సరిపోయిందన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు ఎక్కువయ్యాయని, ఒక చేత్తో వంద రూపాయలు ఇచ్చి మరో చేత వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ, కాంగ్రెస్‌ బద్వేలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌.డి.విజయజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

➡️