నేడు సిఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. ఇందుకుగాను కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ముస్తాబైంది. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఐటి పార్క్‌ మేధా టవర్స్‌ ప్రాంతాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. మొత్తం 11 ఎకరాల్లో భారీ వేదికను, ఆవరణలో భారీ టెంట్లతో 36 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సుమారు లక్ష వరకు కుర్చీలు వేసారు. బందోబస్తు కోసం 10 వేల మంది వరకు పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ కోసం పలుచోట్ల 56 ఎకరాలను కేటాయించారు. సభ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రాంగణంలో పలుచోట్ల ఎల్ ఈ డి  స్క్రీన్లను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజీపీ, జనసేన శ్రేణులతోపాటు ప్రజలు కూడా భారీ సంఖ్యలో తరలిరానున్నారు. రాష్ర్టంలో కూటమి ఘన విజయానికి ప్రతీకగా ఈ కార్య్రకమం ఉంటుందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. గెలుపొందిన కూటమి ఎంఎల్ఎ లు, ఎంపి లు కూడా వస్తున్నారు. వీరందరికీ ప్రోటోకాల్ ప్రకారం.. ఎక్కడా ఇబ్బందులు లేకుండా, భద్రతాపరమైన లోపాల్లేకుండా ఏర్పాట్లు చేశారు. సభా వేదిక ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ నిఘా కెమెరాలను అమర్చారు. సభా ప్రాంగణంలో ప్రముఖుల రాక కోసం ఏర్పాట్లు చేసిన ప్రత్యేక గ్యాలరీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.

➡️