టెట్‌, టీఆర్‌టీ షెడ్యూల్‌ మార్చండి : ఎపి హైకోర్టు

Mar 5,2024 08:04 #AP High Court
  • టెట్‌-టిఆర్‌టిల మధ్య 4 వారాల గడువుండాలి 
  • రాష్ట్రాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు

ప్రజాశక్తి-అమరావతి : ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి) మధ్య కనీసం నాలుగు వారాల వ్యవధి ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తగిన సమయం ఇవ్వకపోవడం హక్కులను హరించడమే అవుతుందని అభిప్రాయపడింది. రెండింటి మధ్య సుమచిత సమయం ఇవ్వకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను  హరించడమేనని వ్యాఖ్యానించింది. టెట్‌-టిఆర్‌టిలను హడావుడిగా నిర్వహించాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ప్రశిుంచారు. టెట్‌ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న ఇచ్చిన నోటిఫికేషన్‌, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 12న ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రశిుస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు సహా ఐదుగురు హైకోర్టును ఆశ్రయించారు. రెండు పరీక్షల మధ్య కనీస సమయం లేదని, గడువు లేకుండా షెడ్యూల్‌ నిర్ణయించడం అన్యాయమని, నోటిఫికేషన్లను రద్దు చేసి తిరిగి షెడ్యూల్‌ ఖరారు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ల వాదనల తర్వాత హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. టెట్‌, టిఆర్‌టిల మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండేలా ప్రభుత్వం షెడ్యూల్‌ మార్పు చేయాలనిఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక కీ జారీ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వాటిని పరిగణనలోకి తీసుకునేందుకు కూడా తగిన సమయం ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలంది. డిఎస్‌సి 2018లో నిర్వహించినప్పుడు టెట్‌, డిఎస్‌సిల మధ్య 60 రోజుల గడువు ఉందని గుర్తు చేసింది. తిరిగి ఐదేళ్ల తర్వాత నిర్వహించబోయే డిఎస్‌సి విషయంలో ఆఘమేఘాలపై హడావుడిగా చేయాల్సిన అవసరం ఎందుకని నిలదీసింది. ఇలా చేస్తే, ప్రాథమిక కీ జారీ, అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు తగిన సమయం ఉండదని, టెట్‌, టిఆర్‌టి మధ్య కనీసం నాలుగు వారాల సమయం ఉండేలా షెడ్యూల్‌ను ప్రభుత్వం మార్చాలని తీర్పునిచ్చింది.

➡️