నేడు ‘వెలుగొండ’ జాతికి అంకితం – ప్రారంభించనున్న సిఎం జగన్‌

Mar 6,2024 11:05
  • నిర్వాసితులకు అందని ప్యాకేజీలు
  • ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే హడావుడి అంటూ విమర్శలు

ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : పశ్చిమ ప్రాంత రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నాడు ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తి చేశారు. అయితే, నిర్వాసితులకు ఇప్పటికీ ప్యాకేజీలు అందలేదు. రెండు సొరంగాల్లో ప్రస్తుతం ఒకటి మాత్రమే పూర్తయింది. రెండో సొరంగం పనులు ఇంకా కొనసాగుతున్నాయి. కాలువ పనులు పూర్తి కాలేదు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తున్న నేపథ్యంలో హడావుడిగా దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. నిర్వాసితులను కొందరిని అధికారులు ఎంపిక చేసి సిఎంతో భేటీ ఏర్పాటు చేశారు. ప్యాకేజీలపై ప్రశ్నిస్తారనే భయంతో బహిరంగ సభ నిర్వహించడం లేదు. దీన్ని దాచిపెట్టేందుకు శివరాత్రి పండగకు శ్రీశైలం వెళ్లే యాత్రికులకు ఇబ్బందులు కల్పించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 15 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది. మూడు జిల్లాల రైతులకు ప్రయోజనం కలగనుంది. నిర్వాసితులు ఏడు వేల మంది వరకూ ఉన్నారు. ఇప్పటికీ 11 ముంపు గ్రామాలు అక్కడే ఉన్నాయి. ఈ పరిధిలోని రైతులు తమ భూములను సాగు చేసుకుంటున్నారు. పరిహారం ఇస్తే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తామని చెప్తున్నారు. ప్యాకేజీల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒక్కొక్కరికీ రూ.12.50 లక్షలు వన్‌టైం సెటిల్‌మెంటును ప్రభుత్వం ఖరారు చేసింది. దీనికోసం రూ.1,200 కోట్లు వరకూ అవసరం. ‘నిధులు వస్తాయి… ప్యాకేజీలు ఇస్తాం’ అంటూ అధికారులు, పాలకపక్ష నేతలు చెప్తూ వచ్చారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ప్రాజెక్టును ప్రారంభించినా నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. శ్రీశైలం ఎగువ భాగాన కృష్టా నది నుంచి నీరు సొరంగాల ద్వారా రావాలి. అక్కడ నీళ్లు లేవు. ఇప్పుడు శిలాఫలకాన్ని మాత్రమే ఆవిష్కరిస్తారు.

➡️