అక్కడికి వెళ్లాల్సిన అవసరమేంటి?

  •  అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో సిఎం రమేష్‌ను విచారించిన డిఎస్‌పి

ప్రజాశక్తి – చోడవరం (అనకాపల్లి) : అధికారుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అనకాపల్లి బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్‌ స్టేషన్‌కు సోమవారం హాజరయ్యారు. ఆయనను డిఎస్‌పి అప్పలరాజు విచారించారు. ఆ రోజు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాను ఎటువంటి గలాటా సృష్టించలేదని, అధికారులతో శాంతియుతంగానే మాట్లాడానని సిఎం రమేష్‌ చొప్పుకొచ్చారు. అనంతరం 41ఎ నోటీసులు అందుకున్న రమేష్‌తో పాటు మిగిలిన వారికీ డిఎస్‌పి సమక్షంలో స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేశారు.
ఈ నెల నాలుగున చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఉన్న బుచ్చిబాబు ట్రేడర్స్‌ టైల్స్‌ దుకాణంపై డిఆర్‌ఐ అధికారులు దాడులు నిర్వహించారు. జిఎస్‌టి లెక్కలపై ఆరా తీశారు. ఈ విషయాన్ని దుకాణం యజమాని స్థానిక టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజుకు, బిజెపి ఎంపి అభ్యర్థి సిఎం.రమేష్‌కు తెలపగా వారు అక్కడకు వచ్చి నానా హడావుడి చేశారు. ఆ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, తాము సేకరించిన ఫైల్స్‌ను లాక్కున్నారని చోడవరం పోలీస్‌ స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో సిఎం రమేష్‌, కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజులతో పాటు ఆరుగురిపై కేసు నమోదైంది. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సిఎం.రమేష్‌కు శనివారం రాత్రి 41ఎ నోటీసులు అందజేశారు. తొమ్మిదో తేదీలోపు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. దీంతో సిఎం రమేష్‌, చోడవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజు, బుచ్చిబాబు ట్రేడర్స్‌ యజమానులు రామకృష్ణ, బుచ్చిబాబు విచారణ హాజరయ్యారు.

➡️