సమస్యలపై ‘ఉపాధి’ ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆందోళన

Dec 19,2023 08:43 #Dharna, #Field assistants
  • ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మ్యాండెస్‌ విధానం రద్దు చేయాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు సోమవారం ఆందోళన బాట పట్టారు. ఎపి గ్రామీణ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ.. ఫీల్డ్‌ అసిస్టెంట్లకు 17 ఏళ్లు సర్వీసును గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన పనులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, అర్హత, అనుభవం కలిగిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రమోషన్‌ సౌకర్యం కల్పించాలని, వీరికి మండల స్థాయిలో బదిలీ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో ఎపి గ్రామీణ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి బి.శ్రీరామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం అమల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే జనవరి 5న చలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద, కాకినాడలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరంధామయ్య మాట్లాడారు. ప్రమాదాల్లో చనిపోతే రూ.10 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టి ఇటీవల మున్సిపాలిటీలోకి విలీనమైన గ్రామపంచాయతీలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టరేట్‌, చింతూరు ఐటిడిఎ వద్ద ఆందోళనలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నెల్లూరులోని విఆర్‌సి క్రీడా మైదానం నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. తమ శ్రమను ప్రభుత్వం దోచుకుంటోందని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️