114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు

  • కడప నుంచి షర్మిల పోటీ
  • మిగిలిన స్థానాలపై 9న జరిగే భేటీలో నిర్ణయం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ఖరారు చేసింది. సోమవారం నాడిక్కడ ఎఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసి వేణుగోపాల్‌ ఆధ్వర్యాన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో ఎంపి, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఈ సమావేశంలో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల, సీనియర్‌ నేత రఘువీరారెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాకూర్‌, కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన 114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వామపక్షాలతో పొత్తులపై చర్చలు పూర్తికాకపోవడంతో మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టామని కాంగ్రెస్‌ నేత తెలిపారు. ఈ నెల 9న మరోసారి సమావేశమై, నిర్ణయం తీసుకుంటామన్నారు.
కడప లోక్‌సభ నుంచి వైఎస్‌ షర్మిల, కర్నూలు నుంచి రామ్‌పుల్లయ్య యాదవ్‌, బాపట్ల నుంచి జేడి శీలం, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కాకినాడ నుంచి పల్లం రాజు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎపిసిసి అధ్యక్షులు షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 114 ఎమ్మెల్యే, 5 ఎంపి స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని అన్నారు. పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులను వారం రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పింఛన్లు అందించాలని ఇసి ఆదేశించిందని, కావాలని పింఛన్లు ఆలస్యం చేస్తే ప్రతిపక్షాలపై నింద మోపాలని వైసిపి చూస్తుందని అన్నారు. పెన్షన్లను పంపిణీపై తాను సిఎస్‌తో నేరుగా మాట్లాడానని, ఒకరోజులో చేసే పనికి 10 రోజుల సమయం పడుతోందని అన్నారు. డిబిటి ద్వారా పంపిణీ చేయకుండా నేరుగా ఇస్తామంటున్నారని, పెన్షన్‌ పంపిణీ విషయంలో సిఎస్‌ చొరవ తీసుకోవాలని, వెంటనే డిబిటి ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని అన్నారు.

➡️