రాజ్యాంగ విలువలను కాపాడాలి : ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : దేశంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు సురక్షితంగా ఉండాలంటే చిన్నతనం నుంచే రాజ్యాంగం, రాజ్యాంగ విలువల పట్ల అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ, విద్యావేత్త కెఎస్‌ లక్ష్మణరావు అన్నారు. విజిఎస్‌ వారు ప్రచురించిన ‘బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక’ పుస్తకాన్ని ఆయన విజయవాడ పుస్తక మహోత్సవం తొమ్మిదోరోజు శుక్రవారం కేతు విశ్వనాథ రెడ్డి సాహిత్య వేదికపై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి పునాదిలాంటి రాజ్యాంగ పీఠికను పిల్లలకు అర్థమయ్యేలా చేసేందుకు ఈ పుస్తకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. సభలో ముఖ్య అతిథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు సామాజిక శాస్త్రాల పరిచయం అనివార్యమన్నారు. యువతలో సామాజిక శాస్త్రాల అధ్యయనం తగ్గిపోవడం వల్ల సమాజంలో మూఢత్వం పెరిగి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక శాస్త్రాల పుస్తకాలతోపాటు, రాజ్యాంగ విలువలను తెలుసుకోవాలని సూచించారు. కెవిపిఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మాల్యాద్రి, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న తదితరులు ప్రసంగించారు.సరియైన ఉచ్చారణే భాషకు ప్రాణం సరైన ఉచ్ఛారణే ఏ భాషకైనా ప్రాణం పోస్తుందని, తెలుగుభాషలో చేస్తున్న ఉచ్ఛారణా దోషాలను తెలుసుకుని సరిచేసుకోవాలని మైనారిటీ సంక్షేమశాఖ కమిషనర్‌ ఎఎమ్‌డి ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై సత్తి లలితారెడ్డి రచించిన ‘సరియైన ఉచ్చారణ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పాణ్యం దత్తశర్మ పుస్తకంలో విశేషాలను వివరించారు. సత్తి సునీల్‌, డాక్టర్‌ జెట్టి ఎలమంద సభలో పాల్గొన్నారు. గోళ్ల నారాయణరావు సభకు అధ్యక్షత వహించారు.

➡️