కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తం

  •  టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల ఐదేళ్లపాటు పడ్డ కష్టాలకు మంగళవారంతో అడ్డుకట్ట పడబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. కూటమి కౌంటింగ్‌ ఏజెంట్లతో చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎన్నికల ఫలితాల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఐదేళ్లు పడ్డ కష్టాన్ని, శ్రమను కొన్ని గంటలపాటు కొనసాగించాలని సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసిపికి సుప్రీంకోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసిపి కౌంటింగ్‌లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని, కూటమి ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని సూచించారు. కంట్రోల్‌ యూనిట్‌ నెంబర్‌ ప్రకారం సీల్‌ను ప్రతి ఏజెంట్‌ సరిచూసుకోవాలని చెప్పారు. డిక్లరేషన్‌ ఫామ్‌ తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. అనారోగ్య కారణాలతో ఏజెంటు ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్‌కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉందన్నారు.

సందడి వాతావరణం
టిడిపి కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరిగిన తరువాత మొదటిసారి చంద్రబాబు టిడిపి కార్యాలయానికి సోమవారం చేరుకున్నారు. ఆయనకు ఆ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం చెప్పడంతో పాటు ‘సిఎం.. సిఎం’ అంటూ నినాదాలు చేశారు.

టిడిపికి, ఎన్‌టిఆర్‌ ఫౌండేషన్‌కు విరాళాలు
టిడిపికి, ఎన్‌టిఆర్‌ ఫౌండేషన్‌కు పలువురు విరాళాలు అందించారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ అనుబంధ విభాగమైన ఎన్‌టిఆర్‌ ఫౌండేషన్‌కు టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్‌కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టిడిపి కార్యాలయంలో చంద్రబాబును కలిసి ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ టిడిపి అధ్యక్షులు వేమూరి రవి, ఎన్‌ఆర్‌ఐ గొట్టిపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు. టిడిపికి రూ.25 లక్షల విరాళాన్ని ఎన్‌ఆర్‌ఐ, వ్యాపారవేత్త బొద్దులూరి కృష్ణ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️