కోర్టు బిల్డింగ్స్‌ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి : హైకోర్టు

Jan 4,2024 08:32 #AP High Court
high court

 

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం తన వాటా కింద విడుదల చేయాల్సిన 60 శాతం నిధుల అంశంపై కూడా వివరాలివ్వాలని కోరింది. భవన నిర్మాణాల పురోగతిని పరిశీలించేందుకు థర్డ్‌ పార్టీ ఏజెన్సీ నియమించాలంది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావుతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరంలో పలు కోర్టులకు అవసరమైన భవన నిర్మాణాలను చేపట్టడం లేదంటూ అదే ప్రాంతానికి చెందిన దేవిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి గతంలో పిల్‌ దాఖలు చేశారు. నిర్మాణాలు తుది దశకు చేరాయని, ఏప్రిల్‌ నాటికి పూర్తవుతాయని ప్రభుత్వం తరఫున ఎజి శ్రీరామ్‌ చెప్పారు. 2017 నాటి పనులతో పోలిస్తే పనుల పురోగతి లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేంద్రం నుంచి 60 శాతం నిధుల విషయంపై కేంద్రంతో చర్చించేందుకు చీఫ్‌ సెక్రటరీ ఢిల్లీ కూడా వెళ్లారని ఎజి చెప్పారు. రాష్ట్ర వాటా విడుదల చేస్తేనే కేంద్ర వాటా వస్తుందని హైకోర్టు నిబంధనల్ని గుర్తు చేసింది. హైకోర్టు న్యాయవాది ఎస్‌ ప్రణతి వాదనలు వినిపిస్తూ.. నిర్మాణాల నాణ్యత పరిశీలనకు థర్డ్‌పార్టీ ఏజెన్సీని నియమించాలన్న ప్రతిపాదనను ఆమోదించింది. పిటిషనర్‌ న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదిస్తూ.. టాటా సంస్థ వాళ్లను థర్డ్‌పార్టీగా నియమించాలని కోరారు. విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది.

➡️