తిరుపతిలో కరోనా‌ కలకలం..!

Dec 29,2023 12:51 #Covid Cases, #Tirupati
covid cases in tirupati
  • రుయా ర్యాపిడ్‌ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌
  • ఇద్దరు ఆస్పత్రి ఐసోలేషన్‌కు..
  • మరో ఇద్దరు హోం ఐసోలేషన్‌కు తరలింపు

ప్రజాశక్తి-తిరుపతి : తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయాస్పత్రిలో చేసిన కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో వైద్యాధికారులు ఉలిక్కిపడ్డారు. పక్క రాష్ర్టాల్లో వస్తున్న కొవిడ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి జిల్లా పరిధిలోని రుయాస్పత్రి, ఏరియా, ప్రాంతీయ వైద్యశాలల్లో కొవిడ్‌ పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో రుయాస్పత్రిలో 20మందికి పైగా రాపిడ్‌ పరీక్ష చేశారు. నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. వీరిలో ముగ్గురు తిరుపతికి చెందిన వారు. కాగా ఇందులో ఒకరు రెండు రోజులుగా రుయాస్పత్రిలో ఎం.ఎం. వార్డులో చికిత్స పొందుతున్నారు. అలాగే తిరుమలకు వచ్చిన బెంగళూరుకు చెందిన మరో 70 ఏళ్ల వృద్ధురాలికి కూడా పాజిటివ్‌ వచ్చింది. తిరుపతికి చెందిన ఇద్దరికీ కొవిడ్‌ లక్షణాలు లేకపోవడం, ఆరోగ్యంగా ఉండటంతో వారు హోం ఐసోలేషన్‌లో ఉంటామని చెప్పి వెళ్లిపోయారు. మిగిలిన ఇద్దరిని మాత్రం రుయా అధికారులు ఆస్పత్రిలోని కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

  • భయపడాల్సిన అవసరం లేదు : డీఎంహెచ్‌వో

రుయాస్పత్రిలో నిర్వహించిన కొవిడ్‌ ర్యాపిడ్‌ పరీక్షల్లో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయని తెలుసుకున్న డీఎంహెచ్‌వో శ్రీహరి బుధవారం సూపరింటెండెంట్‌ రవిప్రభుతో కలిసి ఆస్పత్రిలోని కొవిడ్‌ పరీక్షా కేంద్రాన్ని, ఐసోలేషన్‌ కేంద్రాన్ని, ఆక్సిజన్‌ పడకలను పరిశీలించారు. ర్యాపిడ్‌ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వారిని కేవలం కొవిడ్‌ అనుమానితులుగానే పరిగణిస్తామని, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌ వస్తేనే పాజిటివ్‌గా నిర్థారణ చేస్తామని తెలిపారు. అయితే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలో రోజుకు 100మందికి పైగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. వీలైనంత వరకు అందరూ మాస్కు ధరించడం, శానిటైజర్లు వాడడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించడం సురక్షితమన్నారు. ఆర్‌ఎంవో రవికుమార్‌, ఏఆర్‌ఎంవో హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️