సిపిఐ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

  •  ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలని పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఐ రాష్ట్ర కమిటీ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. ‘జనం కోసం-జనంమధ్యకు-జనప్రణాళిక’ పేరుతో రూపొందించిన మానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. దేశంలో వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న నరేంద్రమోడీని, బిజెపికి వంతపాడుతున్న వైసిపి, టిడిపిలను ఓడించాలని పిలుపునిచ్చారు. లౌకిక ఇండియా వేదిక అభ్యర్ధులను గెలిపించాలని రామకృష్ణ ఈ సందర్భంగా కోరారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై వైసిపి, టిడిపి ఒకరినొకరు తిట్టుకునే దురదృష్టకర వాతావరణం నెలకొనడం బాధాకరమన్నారు. వ్యవసాయ పరిస్థితి, పారిశ్రామిక రంగం, సాగునీటి ప్రాజెక్టులు వంటి మౌలిక సమస్యలు, అభివృద్ధి గురించి ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీలు అలవిగాని వాగ్ధానాలు చేస్తున్నాయని, వీటి అమలుకు కేంద్రబడ్జెట్‌ కూడా సరిపోదన్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి నరేంద్రమోడీ రైతులను మోసం చేశారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ, ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని జగన్‌ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. మెగా డిఎస్సి అని చెప్పి మోసపు డిఎస్సి ఇచ్చారని, ఇప్పుడు ఆ ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు.సిపిఎస్‌ అంశాన్ని పక్కన పెట్టాశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రధానమైన ప్రజల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం ఎన్నికల ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రైతాంగ వ్యవసాయ రుణాల రద్దు, స్వామినాధన్‌ కమిటీ సిఫార్సుల మేరకు పంటలకు మద్దతు ధర, గ్రామీణ పేదలకు సాగుభూముల పంపిణీ, కనీసం వేతనం రూ.36వేలు, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల విధానం రద్దు చేసి వారిని క్రమబద్ధీకరించడం, సామాజిక న్యాయం, సిపిఎస్‌ రద్దు తదితర అంశాలపై మానిఫెస్టో రూపొందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, జి ఓబులేసు, కెవివి ప్రసాద్‌, దుర్గాభవాని పాల్గొన్నారు.

➡️