ఆదివాసీల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలనుఉరితీసినా తప్పులేదు

-ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలి?

ఆదివాసీ జనరక్షణ దీక్షలో వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టి, గోదావరిలో నిట్టనిలువునా ముంచేస్తూ, షెడ్యూల్‌ ప్రాంతాల నుండి తరిమివేస్తూ హక్కులను అన్ని విధాల హరిస్తున్న ప్రభుత్వాలను ఉరితీసినా తప్పులేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. అటువంటి విధానాలను అమలు చేస్తున్న పార్టీలకు ఓటు ఎందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, ఆదివాసీల హక్కులు కాపాడాలని, వారికి ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలని, జిఓ నెంబరు 3పై ఆర్డినెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన విజయవాడ ధర్నా చౌక్‌లో శనివారం ఆదివాసీ జనరక్షణ దీక్ష నిర్వహించారు. వి. శ్రీనివాసరావుతో పాటు, డిఎస్‌సికి సిద్ధమవుతున్న ఆదివాసీ గ్రాడ్యుయేట్‌ పులి .అశోక్‌, విఆర్‌ పురం ఎంపిపి కారం లక్ష్మి, కూనవరం మండలం పెద ఆర్కూరు సర్పంచ్‌ మడకం నాగమణి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్‌ దీక్షలో పాల్గన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్‌తో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు కాపాడటంలో, జిఓ నెంబరు 3పై ఆర్డినెన్స్‌ తెచ్చి స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని అన్నారు. అడవులను , భూమిని అదానీకి కట్టబెడుతూ ఆదివాసీలను షెడ్యూలు ప్రాంతాల నుండి తరిమేసేందుకు కుట్ర చేస్తున్నాయని అన్నారు. పోలవరం ముంపులో మునిగిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సిపిఎం ఆధ్వర్యాన రెండు రోజులపాటు మన్యం, ఏజెన్సీలో దీక్షలు జరిగాయని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం, హక్కుల పరిరక్షణ కోసం గిరిజన ప్రాంతాల్లో వివిధ గిరిజన సంఘాల పిలుపు మేరకు ఆదివారం జరగనున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అరకు పార్లమెంటు అంతా ఐదో షెడ్యూలులో ఉందని, అయినా అక్కడ ఆదివాసీల హక్కులను కేంద్రం హరిస్తోందని చెప్పారు.

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాలో పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టు పేరుతో గ్రామసభలు కూడా నిర్వహించకుండా భూములు లాగేసుకున్నారని తెలిపారు. మైనింగ్‌, అటవీ సంపద దోపిడీ కోసం అదానీలకు అనుకూలంగా మన్యం జిల్లా నుండి రాజమండ్రి వరకూ హైవే వేస్తున్నారని చెప్పారు. ఏజెన్సీలో రోడ్లులేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయని, వాగులు, వంకలపై చిన్న వంతెనలు కట్టాలని దశాబ్దాలుగా డిమాండ్లున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అన్యాయంపై ప్రశ్నించిన వారిపై ఉపా లాంటి చట్టాలు తెచ్చి నక్సలైట్ల సాకు చెబుతూ కాల్చిపారేస్తున్నారని చెప్పారు. మరోసారి ఏజెన్సీ ప్రాంతాన్ని అశాంతి నిలయంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉద్యోగాలు నూటికి నూరుశాతం వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఐదో షెడ్యూలు ప్రకారం చట్టం చేయాల్సి ఉన్నా చేయడం లేదని, స్పెషల్‌ డిఎస్‌సి పెట్టాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మాతృభాషా వలంటీర్లకు రూ.5000 ఇస్తున్నారని, వారి ఉద్యోగాలూ రెగ్యులరైజ్‌ చేయడం లేదని తెలిపారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడుభూములకు పట్టాలివ్వాలని డిమాండ్‌ చేశారు. నా ఎస్‌సిలు, ఎస్‌టిలు అని చెప్పుకునే జగన్‌ మోహన్‌రెడ్డి ఐదేళ్ల కాలంలో ఎన్ని పట్టాలు ఇచ్చారో చెప్పాలన్నారు.

టిడిపి, బిజెపిలది తప్పుడు ప్రచారం…

పోలవరం ప్రాజెక్టు అంటే అందరూ డ్యామ్‌ అనుకున్నారని, సిపిఎం ఆందోళన తరువాత ముంపునకు గురవుతున్న ప్రజల బాధలు ప్రపంచానికి తెలిశాయని శ్రీనివాసరావు అన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని బిజెపి నాయకులు చెప్పుకుంటున్నారని, అది తప్పుడు ప్రచారమని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా హక్కుగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు తాజా అంచనా రూ.55 వేల కోట్లని, అందులో రూ.33 వేల కోట్లు పునరావాసులకు ఇవ్వాలని ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. అవేమీ చేయకుండా సిగ్గులేని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటువంటి అబద్ధాలకోరు ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. టిడిపి నాయకులు తమ హయాంలో 75 శాతం ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇది కూడా తప్పుడు ప్రచారమేనని అన్నారు. ఆచరణలో 22 శాతానికి మించి పూర్తికాలేదని అన్నారు, ప్రాజెక్టు అంటే పునరావాసం కూడా పూర్తి చేయాలనే ఇంగిత జ్ఞానాన్ని వారు మరచిపోయారన్నారు.

జగన్‌ ముంచేశాడు…!

జగన్‌ నిర్వాసితులను నిలువునా ముంచేశాడని అన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంచుతానని చెప్పి 50 కుటుంబాలకు మాత్రమే ఇచ్చి చేతులు ఎత్తేశాడని అన్నారు. నిర్వాసితులపై సిపిఎం ఆందోళన తరువాత సర్వే చేసి అందరికీ 2023 సెప్టెంబరు అక్టోబరులోపు న్యాయం చేస్తామని హామీనిచ్చారని, ఇంతవరకు చేయలేదని అన్నారు. ఇన్ని అన్యాయాలు చేసిన టిడిపి, బిజెపి, వైసిపిలకు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కులేదని పేర్కొన్నారు. పోలవరం గైడ్‌వాల్‌ కుంగిందని, కాపర్‌డ్యాం రంద్రాలు పడ్డాయని, డయాఫ్రం వాల్‌ దెబ్బతిందని అన్నారు. ఇది కాళేశ్వరంకంటే పెద్ద కుంభకోణంగా మారుతోందని, ఆ ప్రాజెక్టు కంటే అధ్వానంగా తయారైందని చెప్పారు. వరదలు వచ్చి జరగరానిది జరిగితే పాత ఉభయగోదావరి జిల్లాలు తుడిచిపెట్టుకుపోతాయని, దీనికి బాధ్యులైన కాంట్రాక్టరు, అధికారులు, ముఖ్యమంత్రి, మంత్రులకు ఏ శిక్ష వేసినా తప్పులేదన్నారు.

గిరిజన హక్కులు కాపాడండి : విల్సన్‌

సిపిఐ రాష్ట్ర నాయకులు జెల్లి విల్సన్‌ మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలపై సిపిఎం చేపడుతున్న పోరాటాలకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తోందని, వారి పోరాటాల్లో తాము భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. నిరంతరం సామాజిక న్యాయం అని చెబుతున్న జగన్‌మోహన్‌రెడ్డి గిరిజనుల సమస్యలు పరిష్కరించకుండా ఆ మాట చెప్పడం పచ్చి అబద్ధం అవుతుందని తెలిపారు. జిఓ నెంబరు 3పై ఆర్డినెన్స్‌ ఇచ్చి షెడ్యూలు ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల హక్కులు కాపాడాలని డిమాండు చేశారు. కేంద్ర, రాష్ట్రాల తీరుతో ఏజెన్సీలో న్యాయబద్ధ పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ఇప్పటికీ డోలీల్లో మహిళలను తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏజెన్సీలో ఉందని అన్నారు. అంతకుముందు కెవిపిఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన ప్రదర్శనగా వచ్చి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ ఆధ్వర్యాన కళాకారులు పాటలు పాడారు.

పలు సంఘాల మద్దతు

వృత్తిదారుల రాష్ట్ర నాయకులు ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్నారు. రాష్ట్ర కార్మిక నాయకులు దయా రమాదేవి మాట్లాడుతూ ఆదివాసీలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపన్నారు. వారి ఓట్లు కావాలి గానీ వారి అభివృద్ధి పట్టడంలేదని ఆగ్రహించారు. యువజన నాయకులు జి.రామన్న మాట్లాడుతూ గిరిజన యువతకు స్పెషల్‌ డిఎస్‌సి ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థి నాయకులు కె.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ఆదివాసీల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రారంభంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు వక్తలను వేదికపైకి ఆహ్వానించగా, ముగింపులో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ వందన సమర్పణ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, రైతు నాయకులు వై కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

➡️