CPM: 5 సంతకాల ఒరవడిలో ప్రజల ఆశలు నెరవేర్చాలి – ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం

Jun 16,2024 23:56 #CPM AP, #CPM AP State Committee

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని ప్రజలు ఎన్నో ఆశలతో భారీ మెజారిటీతో గెలిపించారని, సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా మంచిపాలన అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు చేయడాన్ని స్వాగతించారు. ఆదివారం విజయవాడలోని ఎంబివికెలో ఆయన సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాంతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఎన్‌డిఎ, మోడీ చరిష్మా దెబ్బతింటే దాన్ని కప్పిపుచ్చి బిజెపి రాష్ట్రంలో ఎన్‌డిఎ గెలుపు అని ప్రచారం చేసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పడింది తెలుగుదేశం నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పెత్తనం చేయాలని తెలుగుదేశం ఉనికిని కనపడకుండా చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే బిజెపి ఎన్‌డిఎ ముసుగును తొడుగుతోందని అన్నారు. ఐదు సంతకాల ఒరవడిలోనే టిడిపి-జనసేన ఇచ్చిన మిగిలిన వాగ్దానాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అమరావతి శాశ్వత రాజధానిగా నిర్ణయించేలా చట్టం చేసే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసే విధంగా ప్రయత్నించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావాలంటే ముందుగా నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం పనులను, నిర్వాసితుల కాలనీల ఏర్పాట్లను పూర్తి చేయాలని కోరారు. మెగా డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఏజెన్సీలో జిఓ నెంబర్‌ 3 పునరుద్ధరించి ఏజెన్సీ ప్రాంతాలకు స్పెషల్‌ డిఎస్‌సిని నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీ టీచర్‌ పోస్టులతో పాటు మిగిలిన ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. స్మార్ట్‌ మీటర్లను తెలుగుదేశం వ్యతిరేకించిందని, మంత్రి నారా లోకేష్‌ గతంలో వాటిని ధ్వంసం చేయాలని కూడా పిలుపునిచ్చారని, ఇప్పుడు రైతుల నెత్తిపై కుంపటిలా ఉన్న స్మార్ట్‌ మీటర్లను ఉపసంహరించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన జిఓ 596ను రద్దు చేసి అసైన్డ్‌మెంట్‌ భూములు పేదలకే దక్కేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన భూదందాలు, మద్యం, స్మార్ట్‌మీటర్లు, బైజూస్‌, పోలవరం అవినీతిపై విచారణ జరిపించాలని కోరారు. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధనకోసం, విశాఖ ఉక్కు పరిరక్షణకోసం, లౌకికతత్వం, ఫెడరలిజం, రాజ్యాంగ పరిరక్షణ తదితర అంశాల్లో ఒక లౌకిక పార్టీగా తెలుగుదేశం గట్టిగా నిలబడి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలని కోరారు. రాష్ట్రంలో ఎన్నికల్లో ఇండియా తరుపున పోటీ చేసిన అభ్యర్థులకు ఓట్లు వేసిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అరకు పార్లమెంట్‌, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఎం అభర్థులకు మంచి ఓటింగ్‌ లభించిందని, ఆదివాసులు పార్టీని ఆదరించారన్నారు. మిగతా ప్రాంతాల్లో పార్టీ ప్రజా పునాది తగ్గిందని, సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకొని ప్రజా పునాదిని పెంచుకునే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.

➡️