కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

cpm letter to cm jagan on krishnapatnam port

ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం సిపిఎం రాష్ట్ర కమిటి తరుపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. కృష్ణపట్నంలోని కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను గత సంవత్సర కాలంగా అదానీ పోర్టు యాజమాన్యం వారి ప్రయోజనాలకోసం ఒక ప్రణాళిక ప్రకారం తమిళనాడులోని వారి స్వంత పోర్టులకు తరలిస్తున్నారని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ చర్యతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు, ఐదువేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో దానిపై ఆధారపడిన ఎగుమతులు, దిగుమతులు కూడా దెబ్బతింటాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే నిర్మితమైన కంటైనర్‌ ఆధారిత పరిశ్రమలు, గోదాములు, కోల్డ్‌స్టోరేజీల, ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ఈ నిర్ణయంతో పరిశ్రమలు కూడా తరలిపోయి రాష్ట్రాభివృద్దికి నష్టం కలుగుతుందని వివరించారు. పోర్టు యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పోర్టు బెర్తులను వాడుకోవడంతో పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత పెరిగి, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటభూముల్లో పంట దిగుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతొందని, కొన్ని ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలతో నీరు, గాలి కలుషితమై జిల్లా కాలుష్యపు కోరల్లో చిక్కుకునే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియతో కార్మికులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి వుందన్నారు. కెపిసియల్‌ కంపెనీకి 2004 సెప్టెంబర్‌ 17న ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అగ్రిమెంట్‌ ప్రకారం పోర్టు యాజమాన్యం సంరక్షకుడి పాత్ర మాత్రమే పోషించాలని, 30 ఏళ్ల అగ్రిమెంట్‌ కాలపరిమితి తరువాత పోర్టును ప్రభుత్వానికి అప్పగించాలనే నిబంధన ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. అదానీ సంస్ధ వ్యవహారం చూస్తూంటే వారి పోర్టులను అభివఅద్ధి చేసుకునేందుకు ఈ పోర్టును పావుగా వాడుకుంటున్నట్లుగా వుందని తెలిపారు. అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తయ్యే నాటికి కృష్ణపట్నం పోర్టును నిర్వీర్యం చేసేలా అదాని వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు తరలింపుపై ప్రజల్లో ఆందోళన వుందని, కార్మికులు నిరసనలు చేపట్టారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి కృష్ణపట్నం పోర్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. కంటైనర్‌ టెర్మినల్‌ని యధావిధిగా కృష్ణపట్నం పోర్టులోనే కొనసాగించేలా సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

➡️