బిజెపి వ్యతిరేక శక్తులను కూడగడతాం- సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం

cpm press meet on anganwadi strike in nellore

– రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన ఊడిగం

– శ్రామికుల సమస్యలను సర్కారు పరిష్కరించాలి : వి. శ్రీనివాసరావు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి:బిజెపి వ్యతిరేక పార్టీలను, శక్తులను కూడగట్టి రానున్న ఎన్నికల్లో ముందుకు సాగాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. రెండు రోజులపాటు ఏలూరులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి వైసిపి, టిడిపి, జనసేన ఊడిగం చేస్తున్నాయని అన్నారు. ఆ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ప్రజా సమస్యలు, రాజకీయ పరిస్థితులపై సమీక్షించి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం జిందాల్‌కు అప్పగించిందని, కార్మికులు పెద్దఎత్తున పోరాడుతూ కార్పొరేట్‌ శక్తులను అడ్డుకుంటూ వచ్చారని తెలిపారు. బిజెపికి జగన్‌ మద్దతు పలుకుతూ అదానీకి పోర్టులు అప్పగిస్తున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతోన్న బిజెపికి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మద్దతు పలకడం దారుణమన్నారు. అంగన్‌వాడీలు రోడ్డునపడి 31 రోజులు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. వెంటనే చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించి అంగన్‌వాడీలంతా సంక్రాంతి పండుగ జరుపుకునేలా చూడాలన్నారు. 32 లక్షల మంది తల్లీబిడ్డలకు అంగన్‌వాడీలు రక్షణగా నిలిచారని, వారి సమ్మెకు ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. లక్ష మంది అంగన్‌వాడీలు ఉన్నారని, ఒక్క ఉద్యోగిని తొలగించినా తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని, పదవీ కాలం పూర్తయినా ఉద్యోగాల భర్తీ లేదని విమర్శించారు. మెగా డిఎస్‌సి కోసం ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, ఆందోళన చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేయడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏజెన్సీలో స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహించడం లేదన్నారు. వెంటనే టీచర్‌ పోస్టులను భర్తీచేయాలని, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని, ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించడంతోపాటు 104, 108, ఆశాలు, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్స్‌, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తమకు ఎటువంటి హక్కులూ లేకుండా పోయాయని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఎమ్మెల్యేలు కుమిలిపోతున్నారన్నారు. వైసిపి ప్రభుత్వం రోజురోజుకీ ప్రజాదరణ కోల్పోతుందని, సంక్షేమ పథకాలతో ఓట్లు వస్తాయనుకుంటే చెల్లదని, అది వైసిపి రాజకీయ ఉనికికే ప్రమాదమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, జిల్లా కార్యదర్శి ఎ.రవి, ఏలూరు నగర కార్యదర్శి పి.కిషోర్‌ పాల్గొన్నారు.

 

cpm press meet on anganwadi strike in nellore

➡️